అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్.. పరుగులు పెట్టిన పోలీసులు

by Anukaran |   ( Updated:2021-08-07 00:01:04.0  )
amitab
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసం, ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన ముంబై పోలీసులు అమితాబ్ నివాసం, పలు రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. అనంతరం విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, అది ఫేక్ బెదిరింపు కాల్‌ అని తేలడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కాల్‌ వచ్చింది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినల్, బైకుల్లా, దాదర్‌ రైల్వే స్టేషన్లు, జుహూలోని అమితాబ్‌ నివాసం వద్ద బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, స్నిప్పర్ డాగ్స్ బిగ్‌బీ నివాసం సహా రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో.. విచారణ చేపట్టన అధికారులు అది ఫేక్ కాల్ అని తేల్చారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అయితే ఈ కాల్స్ చేసింది ఎవరు అని తెలుసుకునేందుకు దర్యాప్తు సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story