అబ్బురపరిచే సోయగాలు.. పరవళ్లు తోక్కుతున్న జలపాతాలు

by Shyam |
అబ్బురపరిచే సోయగాలు.. పరవళ్లు తోక్కుతున్న జలపాతాలు
X

దిశ, ఇబ్రహీంపట్నం: చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు వర్షాకాలం వచ్చిందంటే చాలు దారిపొడవునా పర్చుకున్న పచ్చదనం, పక్షుల కిలకిలారాగాలు, పచ్చని పంటపొలాలు. వాటి మధ్య తాటి చెట్లతో సుందర దృశ్యాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. ప్రకృతి అందాలకే కేర్ ఆఫ్ అడ్రస్‌గా బోడకొండ వాటర్ ఫాల్స్ నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు బోడకొండ వాటర్ ఫాల్స్ పొంగిపొర్లుతోంది.

దీంతో వాటర్ ఫాల్స్ చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి యువకులు, మహిళలు, చిన్నలు,పెద్దలు అందరూ ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తారు. రోడ్డుకు ఇరువైపులా నల్లని కొండలు, కొండ పై నుంచి జాలువారే జలపాతం, చూట్టు పచ్చని పొలాలు అరకులోయను తలపించే విధంగా ఉంటుంది. అంతేగాకుండా ఈ ప్రదేశం చూడటానికి వచ్చిన వారంతా బుంగ రేణుక ఎల్లమ్మ గుడిని కూడా దర్శించుకుంటారు.

హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ గ్రామంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో కనిపించే ఈ జలపాతాల అందాలను తనివితీరా చూడాలనిపించే విధంగా ఆకట్టుకుంటోందని పర్యాటకులు అంటున్నారు. వచ్చే దారిలో జపాల-రంగాపూర్‌ల మద్యన ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద ఖగోళ ఆద్యాయన నక్షత్రశాల కూడా మార్గ మధ్యంలో ఉండడం విశేషం. ఈ నక్షేత్రశాలను, బోడకొండ వాటర్ ఫాల్స్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story