బాధితుల కన్నీళ్లతో ప్రాజెక్టులు నింపుతారా?

by Sridhar Babu |   ( Updated:2020-08-16 07:59:28.0  )
బాధితుల కన్నీళ్లతో ప్రాజెక్టులు నింపుతారా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని బాధితుల కన్నీళ్లతో ప్రాజెక్టులను నింపుతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ముంపు గ్రామాలుగా ప్రకటించిన నారాయణపూర్, చర్లపల్లి, మంగపేటల్లోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ బీజేపీ ఉద్యమిస్తోందని, హామీలు నెరవేర్చమంటే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసు నిర్బంధాలతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, హక్కుల కోసం గొంతెత్తిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. బాధితులకు పరిహారం చెల్లించకుండానే నారాయణపూర్ ప్రాజెక్టులో నీరు నింపుతుండడంతో ఇళ్లల్లోకి నీరు చేరుతోందన్నారు. ముంపు గ్రామాల ప్రజలు అస్తులు త్యాగం చేస్తే, ప్రభుత్వం పొమ్మనలేక పొగ పెడుతుందని బండి సంజయ్ ఆరోపించారు. మానవత్వంతో వ్యవహరించకుంటే ముంపు గ్రామాల ప్రజలతో కలిసి ప్రగతి భవన్‌కు వస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story