కేసీఆర్ పాలనలో దివాళా తీసిన తెలంగాణ

by Shyam |
కేసీఆర్ పాలనలో దివాళా తీసిన తెలంగాణ
X

దిశ, న్యూస్ బ్యూరో :
ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్నతెలంగాణ.. కేసీఆర్ పాలనలో దివాళా తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. లాక్‌డౌన్ నెపంతో ఉద్యోగులకు జూన్ నెల జీతాల్లో కోత పెట్టడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.ఈ విషయమై గురువారం సంజయ్‌కుమార్ ఓ ప్రకటన చేశారు.తెలంగాణలో వరుసగా మూడో నెల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దిగజార్చిందని పేర్కొన్నారు. 2018లో అమలు చేయాల్సిన వేతన సవరణ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు.
గత ఆరేండ్లుగా అరిగిపోయిన గ్రాంఫొన్ రికార్డుల్లా లక్ష ఉద్యోగాలు అని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు కొత్తగా 40వేల ఉద్యోగాలను కూడా నియమించని అసమర్ధుడని అన్నారు.ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామని చెప్పి, నేటికి ఆ విషయంపై ఊసే ఎత్తకపోవడం కేసీఆర్ అబద్ధాల చిట్టాకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగి అన్న పదమే ఉండదని ఉద్యమ సందర్భంగా ఇచ్చిన వాగ్దానం నీటీ మీద రాతగానే మిగిలిందన్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగుతున్నందుకు కేసీఆర్ సిగ్గుపడాలని సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జూన్ నెలలో పూర్తి వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story