బీజేపీ మత విద్వేషాన్ని కొనసాగిస్తోంది : సోనియా

by vinod kumar |   ( Updated:2020-04-23 09:13:21.0  )
బీజేపీ మత విద్వేషాన్ని కొనసాగిస్తోంది : సోనియా
X

న్యూఢిల్లీ : కరోనా ఆపత్కాలంలో మొదటిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ మతవిద్వేషపు వైరస్‌ను వ్యాపిస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇది ప్రతి పౌరుడిని కలత చెందించే అంశమని అన్నారు. కరోనా మహమ్మారిని ఐక్యంగా ఎదుర్కోవాలి కానీ, బీజేపీ విద్వేషాన్ని గుమ్మరిస్తున్నదని చెప్పారు. ఇది ప్రజల మధ్య సామరస్యాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నదని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు మనమందరం కలిసి శ్రమించాల్సి ఉన్నదని వివరించారు. గురువారం కీలక పార్టీ నేతలతో కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ సమావేశమయ్యారు. కరోనా కట్టడికి విలువైన సూచనలిచ్చామని, ప్రధానికి పలు లేఖలు రాశామని సోనియా అన్నారు. దురదృష్టవశాత్తు వాటిని కేంద్రం పాక్షికంగానే స్వీకరించిందని చెప్పారు. కాగా, లాక్‌డౌన్ నిబంధనలతో పేదలు తిప్పలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, వలస జీవులు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మే 3వ తేదీ తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపై ఇంకా స్పష్టత లేదని తెలుస్తున్నదని చెప్పారు. ఒకవేళ మే 3వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే.. పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించారు.

చీప్ పాలిటిక్స్ చేయకండి : కేంద్ర్రం మంత్రి

కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ‘మేము మతపరమైన విభజన చేయడం లేదు. కొవిడ్ 19పై ఐక్యంగా పోరాడుతున్నాం. అందుకే.. చీప్ పాలిటిక్స్ చేయవద్దని వారికి(కాంగ్రెస్) నా విజ్ఞప్తి. చిల్లర రాజకీయాలు చేయకండి’ అని విమర్శలను తిప్పికొట్టారు.

Tags: congress, bjp, communal, spread, sonia gandhi, pm

Advertisement

Next Story