బీజేపీ అధ్యక్షుడిపై సీనియర్ల కినుక..

by  |   ( Updated:2020-03-12 11:06:05.0  )
బీజేపీ అధ్యక్షుడిపై సీనియర్ల కినుక..
X

దిశ, న్యూస్‌బ్యూరో:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి చాలామంది సీనియర్ నేతలు అధ్యక్ష పదవి రేసులో ఉండగా ఆర్ఎస్‌ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఆ పార్టీ సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవంలేని నాయకునికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక అధిష్టానం ఆలోచన అంతుపట్టడం లేదని సీనియర్ నేతలు వాపోతున్నారు. పార్టీ బలోపేతానికి దూకుడు స్వభావం పనిచేయదు, అందుకు వ్యూహాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకుపోయేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాడు! అధికార పార్టీకి ధీటుగా నిలబడగలుగుతాడా ! అన్న చర్చ ప్రస్తుతం బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.

కొద్దికాలంగా సీనియర్ నాయకులు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అధిష్టానం మాత్రం అధ్యక్షుడి ఎంపికపట్ల నాన్చుడు ధోరణి వహిస్తూ తాజాగా గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గీయులు తెలుపుతున్నారు. బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కలవరం మొదలైంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందన్న నెపంతో బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ భావజాలం పనిచేయదని కొందరు బీజేపీ సీనియర్ నాయకులు అంటుంటే.. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న పార్టీని నూతన అధ్యక్షుడు ఎటువైపు తీసుకుపోతాడోనని మరికొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ గట్టెక్కుతుందా! అన్న విషయం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Tags: telangana, president, j.p nadda,sanjay, delhi, bjp

Advertisement

Next Story

Most Viewed