- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ అయోధ్యపై బీజేపీ కన్ను
దిశ, భద్రాచలం: బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా భద్రాచలం గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు అధికార పార్టీ నుంచి వలసలు ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారమే ల క్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీ భద్రాచలం అసెంబ్లీ సీటు గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కాషాయ నేతలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ పరిశీలకుల ఊహలకు అందని విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా వినిపిస్తున్నది. కమలం పార్టీ తన అమ్ముల పొదిలో శక్తివంతమైన అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్నటివరకు కమ్యూనిస్టుల (సీపీఎం) కంచుకోటగా, నేడు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంపై కమలం పార్టీ కన్నేసింది. కేంద్ర ప్రభుత్వ అండదండలతో భద్రాచలంలో పాగా వేయాలంటే ఏమిచేయాలనే దానిపై బీజేపీ అగ్రనేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ మేరకు స్కెచ్ రెడీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. కానీ ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను బట్టి బీజేపీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
నిధుల కేటాయింపుతో..
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం, దీని అనుబంధ పర్ణశాల సీతారామచంద్ర స్వామి వారి ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి ప్రణాళిక సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ఆలయాలను కనీసం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో, ముఖ్యంగా శ్రీరామ భక్తుల్లో అభిప్రాయం నెలకొన్నది. ఈ అసంతృప్తిని అనుకూలంగా మలుచుకొనే యత్నాల్లో బీజేపీ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ ప్రయోగంతో కొంతమేరకు సక్సెస్ అయింది. ఇప్పుడు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌లకు సరిహద్దుగా ఉన్న భద్రాచలం ప్రాంతంలో రాములోరి సెంటిమెంట్ రగిలించడానికి సమాయత్తం అవుతున్న ట్లు తెలుస్తోంది. ఆలయాల అభివృద్ధికి పూనుకున్నప్పుడే ఈ అస్త్రం ఫలిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది.
సమస్యల పరిష్కారంపై దృష్టి..
పోలవరం ముంపు లేకపోయినా హడావుడిగా ఆంధ్రాలో కలిపిన భద్రాచలం శివారు గ్రామ పంచాయతీలను వెనక్కి తీసుకు రావాలనే పబ్లిక్ డిమాండ్ ఉంది. భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్లడానికి ఇపుడు దాదాపు 12 కిమీ ఆంధ్రాలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు అనేక రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య కేవలం కేంద్రం ద్వారానే పరిష్కారం అవుతుంది. ఇక్కడ జరిగిన లోపాన్ని సరిదిద్ది ఆ పాపాన్ని టీడీపీపైకి నెట్టి భద్రాద్రి నియోజకవర్గ ప్రజల మది దోచుకునేలా బీజేపీ నాయకత్వం స్కెచ్ రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. ముంపులేని విలీన గ్రామాలు వెనక్కి తీసుకొస్తే ప్రజల అభిమానం చూరగొని భద్రాచలంలో బీజేపీ బలపడటానికి అవకాశం ఏర్పడుతుందని స్థానిక బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా లబ్ధిపొందేలా ఓ పథకం ప్రకారం అడుగులు వేయడానికి బీజేపీ అధిష్ఠానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్‌పైనే గురి
శక్తిమంతమైన అస్త్రాలకు తోడు స్థానిక రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొనేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహరచనలు చేస్తోంది. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ప్రభావితం చేయగలిగిన నాయకత్వం కోసం వేచిచూస్తోంది. అదే క్రమంలోనే పార్టీ బలం పెంచుకోవడానికి అధికార టీఆర్ఎస్‌పైనే గురిపెట్టబోతోంది. ముందుగా కిందిస్థాయి క్యాడర్‌ను తమవైపు తిప్పుకోవడానికి గుట్టుగా ప్రయత్నాలు ఆరంభించింది. తెలంగాణ ఉద్యమకారుల పట్ల అధికార టీఆర్ఎస్‌లో చిన్నచూపు నెలకొంది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరికతో ఆయన వెంట వచ్చిన వారి ప్రభావం పార్టీలో పెరిగింది. పార్టీలో పదవులు, పెత్తనం వారికే దక్కింది. ఇది జీర్ణించుకోలేని తెలంగాణ ఉద్యమకారులు వలస నాయకత్వంపై కోపంతో రగిలిపోతూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి దుబ్బాక, నిన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీజేపీ ఒక్కటే బలపడుతుందనే దీమా ఏర్పడటంతో పలు పార్టీలలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కమలం పార్టీ వైపు చూస్తున్నారు. ఆ క్రమంలోనే టీఆర్ఎస్‌ని బలహీనపర్చి తాము బలపడాలనే యోచనలో కమలం నేతలు పావులు కదుపుతున్నారు. పెద్ద లీడర్లను కమలం గూటికి రప్పించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి టికెట్ కోసం బీజేపీ ముందు క్యూకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.