‘ప్రభుత్వం పైసలిచ్చేది ఎందుకో తెలుసా’

by Shyam |   ( Updated:2023-08-08 09:20:52.0  )
‘ప్రభుత్వం పైసలిచ్చేది ఎందుకో తెలుసా’
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకే వరద బాధితులకు రూ. 10 వేల అత్యవసర ఆర్థికసాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రభుత్వాధికారులు బాధితుల వివరాలను సేకరించి నగదును ఇవ్వాల్సిందిపోయి.. టీఆర్ఎస్ కార్యకర్తలే నగదును పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కేవలం ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు.

పేద ప్రజలకు ఆర్థిక సాయం అందజేయడం ముఖ్యమే అన్న రాజాసింగ్.. ఎన్నికల లబ్ధి కోసం రూ. 10 వేలు ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. చాలా ఏరియాల్లో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు ఇస్తూ.. ఓట్లను అడుగుతున్నారని చెప్పారు. దీని పై లీగల్‌గా ముందుకెళ్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అత్యవసర ఆర్థికసాయంలో 50 శాతం తమ జేబులో నింపుకొని నకిలీ బాధితులను చూపిస్తున్నారన్నారు. నిజమైన బాధితులకు ప్రభుత్వాధికారులే సర్వే చేసి ఆర్థిక సాయం అందజేయాలన్నారు.

ఇదే వ్యవహారంలో వివాదాలు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలన్నారు. ఇదే కొనసాగితే తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్తల దోపిడీని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డుకుంటున్నారని గన్‌ఫౌండ్రీలో పలువురు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సమయంలో రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది.

Advertisement

Next Story

Most Viewed