గద్వాలలో ఉద్రిక్తత.. లాఠీలతో పోలీసుల ఓవరాక్షన్ (వీడియో)

by Shyam |   ( Updated:2023-04-01 18:44:16.0  )
గద్వాలలో ఉద్రిక్తత.. లాఠీలతో పోలీసుల ఓవరాక్షన్ (వీడియో)
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పేదలకు కేటాయించిన వివాదాస్పద స్థలంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నర్సింగ్ కళాశాల, జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు మంత్రి పర్యటన అడ్డుకునేందుకు యత్నించిన అంశం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా పలువురికి గాయాలు కూడా అయ్యాయి. కాగా ఈ చర్యలను నిరసిస్తూ గురువారం ఉదయమే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దిష్టిబొమ్మలకు శవ యాత్ర నిర్వహించి దగ్ధం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తం అవుతున్నాయి.

సీఎం దిష్టిబొమ్మ కాలిస్తే తప్పా..?


ప్రధానమంత్రి దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేస్తుంటే పట్టించుకోని పోలీసు లారా.. సీఎం బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దగ్ధం చేస్తే తప్పా అని గద్వాల జిల్లా కేంద్రంలో ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య మాట మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది.

Advertisement

Next Story