‘మీ మామ నిన్ను ఆగం జేస్తుండు… హరీశ్ రావ్’

by Anukaran |   ( Updated:2020-09-22 04:05:35.0  )
‘మీ మామ నిన్ను ఆగం జేస్తుండు… హరీశ్ రావ్’
X

దిశ, దుబ్బాక: మంత్రి హరీశ్ రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో హరీశ్ రావును మంత్రి పదవి నుంచి తప్పించి, ఢిల్లీకి పంపి, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ… ‘మీ మామే నిన్ను ఆగం చేసేందుకు సన్నాహాలు చేస్తుంటే… నువ్వు బీజేపీపైన నిందలు వేయడం మానుకోవాలి హరీశ్ రావు’ అని రఘునందన్ రావు సూచించారు.

అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా మాటి మాటికి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించి, ఇప్పటివరకూ ఏం చేశారని ప్రశ్నించారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక హరీశ్ రావుకు తొమ్మిది నెలల వరకూ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు రూ.20 లక్షల నష్టపరిహారం ఇస్తే… దుబ్బాక నియోజక వర్గ ప్రజలు ఏం పాపం చేశారని రూ.2లక్షలు ఇస్తున్నారని మండిపడ్డారు. పదిహేనేండ్ల నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు అనుభవిస్తున్నారు కానీ, ఎప్పుడైనా గువ్వలేగి గ్రామంలో అడుగు పెట్టారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed