‘బీజేపీ ఉన్నంతకాలం.. అంగుళం భూమి కూడా పోదు’

by Shyam |
BJP leader Muralidhar Rao
X

దిశ, కంటోన్మెంట్: తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న రాంచందర్ రావుకు మద్దతుగా కంటోన్మెంట్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్లతో సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా మురళీధర్ రావు హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయిందని, కుటుంబ పాలనతో భ్రష్టుపట్టిపోయిన హస్తం పార్టీకి అధ్యక్షుడిని నియమించుకునే పరిస్థితి లేదన్నారు. లైఫ్ టైమ్ అధ్యక్షులు ఓకే పార్టీ నుంచి రావడమేమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ కెబినెట్ మీటింగ్ డైనింగ్ టేబుల్ పై జరుగుతుందని ధ్వజమెత్తారు. బీజేపీ ఉన్నంతకాలం భారత్ భూ భాగంలో అంగుళం భూమి కూడా పోదన్నారు. అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ చేసి పక్క దేశాల భూములను అక్రమించే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో విద్యారంగానికి గ్రహణం పట్టుకుందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో 70 శాతం ఖాళీలున్నట్లు తెలిపారు. విద్యారంగాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ల చేతిలో పెట్టి నిర్వీరం చేసే కుట్ర తెలంగాణలో ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఓడిపోయే సీటును మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు ఇచ్చి సీఎం కేసీఆర్ అవమాన పరుస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు లేకనే వాణీదేవిని బరిలో నిలిపారని విమర్శించారు. ప్రజలను, మంత్రులను, ప్రతి పక్ష పార్టీలను కలువని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. ఆరేళ్లలో ఏన్ని ఉద్యోగాలు ఇచ్చారో బహిర్గతం చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. 12 వందల మంది ప్రాణాలను త్యాగం చేస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని నమ్మించి గద్దెనెక్కిన కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. సీఎం కుర్చిని చెప్పుతో పోల్చి కేసీఆర్ ప్రజల తీర్పును అపహాస్యం చేసిండని ధ్వజమెత్తారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినాసీఎంకు బుద్ధిరాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహంకాళి అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, కార్పొరేటర్ దీపిక, మాజీ మేయర్ సుభాష్ చందర్ జీ, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు జంపనప్రతాప్, జె.రామకృష్ణ, భానుక నర్మద, బీజేపీ రాష్ట్ర నాయకులు భూమన్న, భానుక మల్లికార్జున్, ఆకుల నాగేశ్,సారంగపాణి, బీఎన్ శ్రీనివాస్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Next Story