మహారాష్ట్రలో బీజేపీకి భంగపాటు

by Shamantha N |
మహారాష్ట్రలో బీజేపీకి భంగపాటు
X

ముంబయి: మహారాష్ట్రలో బీజేపీకి మరో భంగపాటు ఎదురైంది. ఈ నెల 1న జరిగిన ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే స్థానంలో విజయాన్ని నమోదుచేసుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి (మహా వికాస్ అగాఢి-ఎంవీఏ) నాలుగు సీట్లను కైవసం చేసుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కంచు కోటగా భావించే నాగ్‌పూర్ లోనూ బీజేపీ పరాజయం పాలవ్వడం పార్టీ శ్రేణుల్లో నిరాశను మిగిల్చింది. విరుద్ధ భావజాలాలు గల పార్టీలు ఎంవీఏగా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి.

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అమ్రీశ్ పటేల్ ఉపఎన్నిక జరిగిన ధూలే-నాందర్బర్ నుంచి మరోసారి గెలుపొందారు. ఔరంగాబాద్, పూణె, నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్, పూణె, అమరావతి టీచర్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. భావజాల వైరుధ్యం కారణంగా ఎంవీఏ సర్కారు దీర్ఘకాలం నిలబడదని బీజేపీ చెబుతూ వచ్చింది. కానీ, తమ కూటమి చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకుంటూ కాంగ్రెస్, ఎన్‌సీపీ అభ్యర్థులు చెరో రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకున్నాయి. శివసేన పోటీ చేసిన ఏకైక స్థానం(అమరావతి)లో ఓడిపోయింది. ధూలే-నాందర్బర్ స్థానంలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది.

రాష్ట్రంలో గతేడాది నుంచి ఎంవీఏ సర్కార్ మెరుగైన ప్రదర్శనకు నిదర్శనమే ఈ ఫలితాలని శరద్ పవార్ అభివర్ణించారు. తమ అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయని, మరిన్ని సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని భావించామని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. మూడు పార్టీల పవర్‌ను తప్పుగా అంచనా వేశామని అంగీకరించారు.

Advertisement

Next Story