- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసమ్మతి సెగలు.. నాగర్జునసాగర్‌లో బీజేపీకి షాక్
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పుణ్యమంటూ బీజేపీలో అసమ్మతి రాగం మొదలయ్యింది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులే దొరకని పరిస్థితి. కానీ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాం నెలకొంది. తెలంగాణలో అసలు బీజేపీకి ఇలాంటి రోజులు వస్తాయా.. అని ఎవరూ ఊహించి ఉండరేమో.
కానీ సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అభ్యర్థిత్వతం కోసం హోరాహోరీ పోరు మొదలయ్యింది. ఈ క్రమంలోనే సాగర్ ఉపఎన్నిక టికెట్ ఎవరికీ కేటాయించాలనే విషయంపై బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అశావాహుల సంఖ్య పెరగడంతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది అశావాహులు ఇటువైపు చూస్తుండడం అసమ్మతి రాగానికి ఓ కారణమనే చెప్పాలి. దీనికితోడు సొంత పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి.. ఎవరి దారి వారిదే.. అన్న చందంగా ముందుకుసాగుతున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండు గ్రూపులుగా సాగర్ బీజేపీ..
నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ రెండు గ్రూపులుగా మారిపోయింది. ప్రస్తుత నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితారెడ్డి సాగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ నివేదితా సాగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో బీసీ సామాజికవర్గంలో మంచి నేతగా గుర్తింపు ఉన్న కడారి అంజయ్యయాదవ్ ఉపఎన్నిక టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ అగాథం ఏర్పడిందనే చెప్పాలి. టికెట్ మాకే కన్‌ఫర్మ్ అయ్యిందంటే.. మాకు అయ్యిందంటూ ఇద్దరు ఇప్పటికే ప్రచార వేగం పెంచారు. దీంతో సాగర్ బీజేపీ రెండు గ్రూపులుగా మారింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయామని.. అందుకే ఈసారి టికెట్ మాకే ఇవ్వాలని కంకణాల నివేదిత అంటుండగా, గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారని.. బీసీ సామాజిక నేతగా మంచి గుర్తింపు ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని అంజయ్యయాదవ్ చెబుతున్నారు.
టీఆర్ఎస్ అసంతృప్తి నేతల వైపు..
బీజేపీ టికెట్ రేసులో ఉన్న కంకణాల నివేదిత, కడారి అంజయ్యయాదవ్ సంగతి పక్కనబెడితే.. టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న మరికొంతమంది నేతలు బీజేపీలోకి జంప్ కొట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ సైతం బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న ఒక్కరిద్దరితో నేరుగా సంప్రదింపులు చేస్తోంది. ఇదిలావుంటే.. సాగర్ ఉపఎన్నిక టికెట్‌ను నోముల కుటుంబానికి ఇస్తే.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డి ఆ పార్టీని వీడేందుకు వెనకాడబోరని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంసీ కోటిరెడ్డిని తమవైపు లాక్కునేందుకు బీజేపీ తెర వెనుక ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టిందని సమాచారం.
భిన్నమైన సామాజిక వర్గంతో మేలు..
సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయ్యింది. టీఆర్ఎస్‌లో మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం విన్పిస్తోంది. అయితే ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఖరారు చేస్తే మంచి ఫలితం ఉంటుందని బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండడం గమనార్హం. టీఆర్ఎస్ నుంచి నోముల కుటుంబానికి మళ్లీ టికెట్ కేటాయించాలన్న వాదన ఉన్నప్పటికీ.. నాన్‌లోకల్ ఇష్యూ తెరపైకి రావడంతో టీఆర్ఎస్ పెద్దలు సైతం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఏదీఏమైనా సాగర్ ఉపఎన్నిక బీజేపీలో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేసింది. మరీ పార్టీ అధిష్టానం ఆ అసమ్మతిని చల్లార్చి.. గ్రూపు రాజకీయాలకు చరమగీతం పాడుతుందా..? లేదా? అన్న వేచిచూడాల్సిందే.