దుమ్ములేపిన బీజేపీ.. మున్సిపోల్స్‌లో క్లీన్ స్వీప్

by Anukaran |   ( Updated:2021-02-23 12:10:05.0  )
దుమ్ములేపిన బీజేపీ.. మున్సిపోల్స్‌లో క్లీన్ స్వీప్
X

గాంధీనగర్: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారాన్ని తిరిగి సొంతం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ప్రజల మూడ్‌ను ఈ ఎన్నికలు వెల్లడిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 21న గుజరాత్‌లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్‌లలో మొత్తం 575 సీట్లకు జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఆప్, ఏఐఎంఐఎం పోటీ చేశాయి. సూరత్‌లో 27 స్థానాలతో సూరత్‌లో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎంఐఎం ఏడుస్థానాల్లో గెలుపు నమోదుచేసుకుంది. కాగా, అన్ని చోట్లా కాంగ్రెస్ సీట్లను కోల్పోయి ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. గతంలో కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. మొత్తం బీజేపీ 483 సీట్లు, కాంగ్రెస్ 55 సీట్లు గెలుచుకుంది. ఇతరులు 37, ఒక్కరు స్వతంత్రంగా గెలుపొందారు. కాగా, అహ్మదాబాద్‌లోని ఒక్క స్థానంలో ఫలితం వెలువడాల్సి ఉన్నది.

బీజేపీపై విశ్వాసముంచినందుకు ధన్యవాదాలు: పీఎం

ప్రజలు అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాలపై అచంచల విశ్వాసాన్ని పెట్టుకున్నారని గుజరాత్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీపై విశ్వాసముంచినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఈ ఆరు నగరాల్లో అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సీఎం విజయ్ రూపానీ అన్నారు. విజయానికి పనిచేసిన కార్యకర్తలను ప్రశంసించారు.

నూతన రాజకీయాలకు ప్రారంభం: కేజ్రీవాల్

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. గుజరాత్ ప్రజలు నూతన రాజకీయాలను ప్రారంభించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు

Advertisement

Next Story