పదవులే లక్ష్యంగా కప్పదూకుడు

by Anukaran |
పదవులే లక్ష్యంగా కప్పదూకుడు
X

దిశ, కంటోన్మెంట్: ఓ వైపు ఎన్నికల వేడి.. మరో వైపు పదవుల హడావుడి వెరసి కంటోన్మెంట్ నేతలు బీజీబీజీ అయ్యారు. బోర్డు ఎన్నికలే టార్గెట్గా స్థానిక నాయకులు పావులు కదుపుతున్నారు. వచ్చే బోర్డు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అవసరమైతే పార్టీలను మారేందుకు వెనుకడడంలేదు. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డులో ఏడుగురు సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో, ఒక్కరు బీజేపీలో ఉన్నారు. మొన్నటివరకు తాజా, మాజీ బోర్డు సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల అనంతరం ఒక్కొక్కరుగా కమలం బాట పడుతున్నారు.

పదవులే ప్రమాణీకం..

ప్రస్తుత కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి గడువు 2019, ఫిబ్రవరి 10వ తేదీతోనే ముగిసింది.ఆరు నెలల చొప్పున ఇప్పటికే రెండుసార్లు పాలకమండలి గడువును పెంచారు. కంటోన్మెంట్ చట్టం ప్రకారం మరోసారి పెంచే అవకాశం లేదు. దీంతో ఈసారి ఎన్నికలైనా నిర్వహించాలి.. లేదా నామినేటేడ్ సభ్యుడినైనా నియమించాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించాలన్నా.. నామినేటేడ్ సభ్యుడిని నియమించాలన్నా.. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొంత మంది బోర్డు మాజీ సభ్యులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులలో ఎన్నికలు నిర్వహించినట్లయి తే.. బీజేపీ బలపరిచిన అభ్యర్థితో బరిలో దిగొచ్చని, లేదంటే కేం ద్రంలో అధికారంలో ఉన్నందున కనీసం నామినేటేడ్ మెంబర్ కోసమైనా గట్టి ప్రయత్నం చేయవచ్చని మాజీలు యెచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీకి రాష్ట్రంలో అనుకూల పవనాలు వీస్తున్నాయి. రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలోనూ ఇదే తరహా ఫలితాలు ఉంటాయని వారు భావిస్తూ..పదవులే ప్రమాణీకంగా పావులు కదుపుతున్నారు.

గులాబీ మాయంగా ఉన్న కంటోన్మెంట్ మెల్లమెల్లగా కషాయమానంగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ టీఆర్ఎస్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మద, ఆమె భర్త భానుక మల్లికార్జున్, సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాస్ రెడ్డిలు కారును దిగి కమలం గూటికి చేరారు. నేడు మరో మాజీ ఉపాధ్యక్షుడు జంపనప్రతాప్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. త్వరలోనే మరికొందరు కీలక నేతలు బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఇకపోతే ముగ్గురు బోర్డు సభ్యులు సైతం త్వరలోనే బీజేపీలోకి వస్తారని బోర్డు ఉపాధ్యక్షుడు రామక‌‌‌ృష్ణ స్వయంగా ప్రకటించడం కలకలం రేపుతోంది. దీంతో టీఆర్ఎస్ సభ్యుల్లోనూ ఒకరిపై మరొకరికి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఎవ్వరు పార్టీని వీడతారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏడుగురు సభ్యులలలో ఎవ్వరిని ఎవ్వరు నమ్మని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజాయిన్ని మూటగట్టుకున్న టీఆర్ఎస్ వచ్చే బోర్డు ఎన్నికల్లో సిట్టింగ్ బోర్డు సభ్యులనే బరిలో నిలుపుతుందా..? లేదా కొత్త మొఖాలను తెరపైకి తేస్తోందా..? అనే ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సిట్టింగ్ కార్పొరేటర్లకు టిక్కెట్లు ఇచ్చినందునే ఓటమి పాలైనట్లు టీఆర్ఎస్ భావిస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed