ఆ మంత్రులకు షాక్ తప్పదా..?

by Anukaran |   ( Updated:2020-12-03 06:12:47.0  )
ఆ మంత్రులకు షాక్ తప్పదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల కోలాహలం ముగియగానే అధికార పార్టీలో మరో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల రెండు లేదా మూడో వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సమాచారం ప్రగతి భవన్ వర్గాల నుంచే లీక్ కావడం మరో విశేషం. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించారు. సంకేతాలు కూడా అందించారు. కానీ వెంటనే గ్రేటర్ ఎన్నికలు రావడంతో ఓ నెల రోజులు వాయిదా పడింది.

అయితే ఈ ప్రచారానికి కొంతమంది బలం చేకూర్చుతున్నా… మరికొందరు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ అనే అంశాన్ని కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే తీసుకోవాలి. ఏదో నలుగురితో చర్చించి అభిప్రాయాలు తీసుకుని విస్తరణ చేశారనే అవకాశం లేదు. కేవలం సీఎం కేసీఆర్ అనుకుంటే చాలు… రాత్రికి రాత్రి సమాచారమిచ్చి ఉదయం వరకు పూర్తి చేస్తారు. తొలిసారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య విషయంలో కూడా అదే జరిగింది. కేవలం ఒక్క రోజులోనే పరిణామాలు మారాయి. ఇలాంటి నిర్ణయాలు సీఎం కేసీఆర్ ఒక్కరే తీసుకుంటారు. దీంతో ఆయన మనస్సులో ఏముందో ఎవరికి తెలియదని, మంత్రివర్గ విస్తరణ చేస్తారో, చేయరో తెలియదంటున్నారు మరికొంత మంది నేతలు.

మంత్రులకు ఉద్వాసన..?

తాజా పరిణామాల్లో పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. వారి స్థానాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం దక్కుతుందంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఆరోపణలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో సదరు మంత్రికి ఉద్వాసన పలికి ఆయన స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యతో భర్తీ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. అదే విధంగా మరో మంత్రి కూడా ఇటీవల బహిరంగ విమర్శలు, భూ పంచాయతీయల్లో జోక్యం ఎక్కువగా చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే సదరు మంత్రిని తొలగించేందుకు అధిష్టానం సిద్ధమైందంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా సదరు మంత్రి పెత్తనం చేశారని, ఇద్దరు, ముగ్గురికి టికెట్లు ఇప్పించుకోవడంలో సదరు మంత్రి కొంత అత్యూత్సాహం చూపించారని సమాచారం.

దీనిపై మంత్రి కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేశారని, ప్రస్తుతం ఆ మంత్రి టికెట్లు ఇప్పించిన వారు ఓటమి అంచున ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తన సోదరుడి వ్యవహారంలో కూడా పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇటీవల కాలంలో భూముల విషయంలో మంత్రి సోదరుడికి, కొంతమంది నేతలతో వివాదం తారాస్థాయికి చేరిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానం ఆరా తీసిందని సమాచారం. దీంతో ఆయన పెత్తనాన్ని, భూ పంచాయతీల్లో ఆధిపత్యాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఆయన స్థానంలో తొలి ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అవకాశం దక్కుతుందని, రేసులో మర్రి జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నారని చెప్పుకుంటున్నారు.

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఉద్వాసన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సదరు మంత్రికి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నా… పలు సామాజిక కోణాలు, రాజకీయ అంశాల నేపథ్యంలో పునరాలోచనలో ఉన్నారని, కానీ మంత్రివర్గం నుంచి తప్పించేందుకే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ మంత్రి స్థానాన్ని ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన ఎమ్మెల్సీతో భర్తీ చేయనున్నట్లు చెబుతున్నారు.

అదే విధంగా నగర శివారు ప్రాంతానికి చెందిన మరో మంత్రికి కూడా మంత్రివర్గం నుంచి బయటకు పంపించేందుకు సిద్దమయ్యారని సమాచారం. అయితే సదరు మంత్రి పలు అంశాలపై బహిరంగంగా విమర్శలు చేయడం, పార్టీ నేతలపైనే దురుసుగా ప్రవర్తించడంతో పాటు భూ దందాల ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్టీ నేతలతోనే వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రిని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఈ స్థానాన్ని కూడా హైదరాబాద్​ ప్రాంతానికే చెందిన ఓ ఎమ్మెల్యేతో భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నెలలోనే ఏదిఏమైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం ఊపందుకుంది.

వరద సాయం మీకే ఇస్తాం..ఓటేయండి

Advertisement

Next Story