- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడే మిస్టేక్ జరిగింది… తప్పు ఒప్పుకున్న గంగూలీ
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్‌లో మరింత ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలో ఐపీఎల్ 2021ని నిర్వహించడం సబబు కాదని బీసీసీఐకి ఎంతో మంది సూచించినా.. మొండిగా ముందుకెళ్లింది. కఠినమైన ప్రోటోకాల్స్ రూపొందించామని, బయోబబుల్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని చెప్పి క్యాష్ రిచ్ లీగ్‌పై ముందుకే వెళ్లింది. తొలి విడత మ్యాచ్‌లు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగినా.. రెండో విడత మ్యాచ్‌లపై కరోనా పంజా విసిరింది. బయోబబుల్‌లో ఉన్న క్రికెటర్లకు కరోనా సోకడం బీసీసీఐని సైతం ఆశ్చర్యపరిచింది. కేకేఆర్ జట్టులో ఇద్దరికి కరోనా సోకినప్పుడు మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ.. వృద్దిమాన్ సాహ, అమిత్ మిశ్రాలు కరోనా బారిన పడటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఐపీఎల్ వాయిదా వేసింది. ఆలస్యంగా అయినా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని కొందరు అంటుంటే.. అసలు బయోబబుల్‌లోకి కరోనా ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించగా.. బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా ప్రయాణాల వల్లే ప్రవేశించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు.
కారావాన్ మోడల్ తప్పు..
దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో కరోనాను కేవలం 6 నగరాలకు పరిమితం చేస్తూ ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించారు. ఒక్కో దశలో రెండు నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించేలా కారావాన్ మోడల్‌లో షెడ్యూల్ విడుదల చేశారు. ఐపీఎల్ ప్రారంభం ముందే క్రికెటర్లు, సిబ్బంది, యాజమాన్యం అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారిని బయోబబుల్‌లోకి పంపారు. పడిక్కల్, నితీశ్ రాణా, అక్షర్ పటేల్ వంటి క్రికెటర్లకు ముందుగానే కరోనా సోకడంతో వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించిన అనంతరం కోలుకున్న తర్వాతే బయోబబుల్‌లోకి అనుమతించారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఐపీఎల్ ప్రారంభించారు. తొలి విడతలో రెండు వారాల పాటు మ్యాచ్‌లు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. కానీ ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు చేరుకున్న తర్వాత కేసులు నమోదయ్యాయి. బయోబబుల్ నుంచి బయోబబుల్‌కు ప్రయాణించిన సమయంలోనే కరోనా సోకి ఉంటుందని గంగూలీ అంటున్నారు. అసలు కఠిన బబుల్‌లోకి వెళ్లిన తర్వాత తిరిగి బయటకు రావడమే పెద్ద తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. కారావాన్ మోడల్ కాకుండా ఒకే నగరానికి ఐపీఎల్‌ను పరిమితం చేయాల్సిందని ఆయన అన్నారు. ముంబై వంటి నగరంలో మూడు, నాలుగు అంతర్జాతీయ స్టేడియంలు అందుబాటులో ఉన్న సమయంలో ఆరు నగరాలను వేదికలుగా ఏర్పాటు చేయడం బీసీసీఐ చేసిన తప్పే అని ఆయన అన్నారు.
ఐపీఎల్ నిర్వహించడం తప్పు కాదు..
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడం తప్పు అని అందరూ విమర్శిస్తున్నారు.. అయితే అది తప్పు అని గంగూలీ అన్నారు. ఐపీఎల్ ప్రారంభం కాకముందు దేశంలో ఇంత తీవ్రంగా కరోనా లేదని ఆయన చెబుతున్నారు. తొలి దశ మ్యాచ్‌లు ముంబై, చెన్నైలో నిర్వహించినప్పుడు ఒక్క కరోనా కేసు కూడా బబుల్‌లో నమోదు కాలేదని ఆయన గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బయోబబుల్ బ్రీచ్‌పై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నదని గంగూలీ చెబుతున్నారు. ఐపీఎల్ కంటే ముందు ఇంగ్లాండ్ సిరీస్ విజయవంతంగా నిర్వహించడం వల్లే కారావాన్ మోడల్ వైపు మొగ్గు చూపినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లీగ్‌ను యూఏఈ తరలించమని చెప్పినా బీసీసీఐ పెద్దలు వినిపించుకోని విషయంపై కూడా గంగూలీ స్పందించాడు. అప్పటి పరిస్థితుల్లో యూఏఈ తరలింపు అవసరం అనిపించలేదని.. అందుకే ఇండియాలోనే నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. అయితే లీగ్ విషయంలో కొన్ని తప్పులు బీసీసీఐ చేసింది. మరింత నష్టం కలగక ముందే లీగ్‌ను వాయిదా వేసి సరైన నిర్ణయం తీసుకున్నామని గంగూలీ చెప్పారు.