ఆ సత్తా భారత్‌కు ఉంది : బిల్‌గేట్స్

by Anukaran |
ఆ సత్తా భారత్‌కు ఉంది : బిల్‌గేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో ఉండగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారత్‌ ఫార్మా కంపెనీలను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఫార్మా కంపెనీలకు సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కరోనా వ్యాక్సిన్ అందించే సామర్థ్యం ఉందని బిల్‌గేట్స్ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే వ్యాక్సిన్ కోసం కీలకమైన పరిశోధనలు జరిగాయని, ఇతర వ్యాధుల కోసం వాడే పలు కాంబినేషన్‌లను ఉపయోగించి కరోనాకు వ్యాక్సిన్ రూపొందించే పనిలో భారత ఫార్మా కంపెనీలు విశేషమైన కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. డిస్కవరీ ప్లస్ డాక్యుమెంటరీ ‘ఇండియాస్ వార్ అగెనెస్ట్ ది వైరస్’ గురించి మాట్లాడిన బిల్‌గేట్స్ భారత ఫార్మా రంగాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

‘భారత ఫార్మా కంపెనీలు చాలా మెరుగైన కృషి చేస్తున్నాయి. ఇతర వ్యాధుల్లానే కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు భారత్‌లోని ఫార్మా కంపెనీలు కష్టపడుతున్నాయని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. భారత్‌కు ఆ సామర్థ్యం ఉంది. ప్రపంచానికి ఎక్కువ మొత్తంలో మందులను అందించే డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచదేశాల్లో ఎక్కడాలేని విధంగా భారత్‌లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ కంపెనీల్లో సీరం ఇన్‌స్టిట్యూట్ అతిపెద్ద ఫార్మా కంపెనీ కాగా, బయో ఈ, భారత్ బయోటెక్ ఇంకా పలు పెద్ద సంస్థలు ఉన్నాయి. ‘భారత ఫార్మా కంపెనీలు స్వదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే వ్యాక్సిన్‌ను తీసుకొస్తాయని నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. కరోనా మరణాలు తగ్గించడం మన బాధ్యత, దీంతో పాటు ప్రజల్లో ఇమ్మ్యూనిటీ పవర్‌ను పెంచడం మన పని. అప్పుడే కొవిడ్-19ని నియంత్రించగలం. భారత్‌లో జనాభా ఎక్కువ. ప్రజలు ఎక్కువగా బయట తిరగడం వల్ల కరోనాను కట్టడి చేయడం అంత సులభం కాదు. వారికి అవసరమైన వాటిని అందుబాటులో ఉంచగలగడమే కీలకమని’ బిల్‌గేట్స్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed