బిల్‌గేట్స్ ఫ్లాష్‌బ్యాక్ కథ!

by Harish |   ( Updated:2021-05-18 21:01:24.0  )
బిల్‌గేట్స్ ఫ్లాష్‌బ్యాక్ కథ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత బిల్‌గేట్స్ గతేడాది కంపెనీ బోర్డు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచమంతటినీ ఆశ్చర్యపరిచేలా ఆయన భార్య మెలిండా గేట్స్‌తో విడాకులు కూడా తీసుకున్నారు. ఈ పరిణామాలన్నిటికీ బిల్‌గేట్స్ కంపెనీలోని తోటి ఉద్యోగినితో శారీరక సంబంధం పెట్టుకోవడమేనని సమాచారం. బిల్‌గేట్స్ కంపెనీ బోర్డు నుంచి తప్పుకున్న సమయంలో బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికే అని అప్పట్లో ప్రకటనలొచ్చాయి. అయితే వాస్తవం అది కాదని, కంపెనీలోని ఓ ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే ఇష్టం లేకపోయినప్పటికీ కంపెనీ బోర్డు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం.

జరిగిందేంటంటే…

అంతర్జాతీయ పత్రిక కథనం ప్రకారం..2000లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో బిల్‌గేట్స్ సన్నిహిత సంబంధానికి ప్రయత్నించారు. దీనిపై సదరు ఉద్యోగిని 2019లో కంపెనీ బోర్డుకు నేరుగా లేఖ కూడా రాశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బోర్డు కంపెనీ బయటి న్యాయ విచారణ సంస్థతో సమగ్రమైన దర్యాప్తు జరిపింది. ఈ అంశంపై విచారణ జరిగినన్ని రోజులు సదరు ఉద్యోగినికి కంపెనీ పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ విచారణ కొనసాగుతున్న సమయంలోనే బిల్‌గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. దీంతో విచారణ ఆగిపోయింది. అయితే, ఈ వ్యవహారంపై కంపెనీ డైరెక్టర్లు బిల్‌గేట్స్‌ను తప్పుబట్టినట్టు, అందుకే ఆయన బోర్డు నుంచి వైదొలగినట్టు పత్రిక పేర్కొంది.

దీనికి సంబంధించి కంపెనీ అధికార ప్రతినిధి కూడా స్పష్టం చేసినట్టు పత్రిక తెలిపింది. ఉద్యోగినితో సన్నిహిత సంబంధం నిజమేనని అయితే, ఉద్యోగినితో ఉన్న సంబంధానికి, బోర్డు నుంచి తప్పుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. 20 ఏళ్ల క్రితం ఆమెతో సంబంధం ఉండేదని, తర్వాత అది స్నేహపూర్వకంగానే ముగిసిందని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల బిల్‌గేట్స్ తన 27 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఉద్యోగినితో సంబంధం కారణంగానే బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకుని ఉండొచ్చని అంతర్జాతీయ పత్రిక అభిప్రాయపడింది.

Advertisement

Next Story