ఆరుసార్లు సీఎం.. కానీ ఎక్కడ పోటీ చేయలే..

by Shamantha N |
ఆరుసార్లు సీఎం.. కానీ ఎక్కడ పోటీ చేయలే..
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ సీఎం నితీశ్‌కుమార్.. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. క్లీన్ ఇమేజ్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న నేత. దాదాపు 45ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తిరుగు లేని లీడర్. ప్రజల పల్స్‌ పట్టి బీహార్ రాజకీయాలను శాసిస్తున్న గొప్ప నాయకుడు. అయితే ఇంతటి మెరుగైన ప్రస్థానం కలిగి ఉన్న నితీశ్.. 35ఏళ్లుగా ఎమ్మెల్యే కాకుండానే ఆరోసారి సీఎంగా కొనసాగుతున్నారు. అసలు ఆయన ఎప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎలా సీఎం కుర్చీ ఎక్కుతున్నారో ఓసారి పరిశీలిద్దాం.. !

1977లో తొలిసారి హర్నాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నితీశ్‌ పరాజయం చెందారు. ఆ తర్వాత మళ్లీ అక్కడ్నంచే 1985లో పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టారు. ఇంతటితో అసెంబ్లీ ఎన్నికలకు పుల్‌స్టాప్‌ నితీశ్.. తదనంతరం లోక్‌సభకు పోటీ చేసి 1989, 1991, 1996, 1998, 1999, 2004లో వరుసగా ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… 2000 సంవత్సరంలో ఫస్ట్‌ టైం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం విశేషం. అప్పుడు మెజార్టీ లేకపోవడంతో కేవలం 8రోజులకే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ ఆరుసార్లు సీఎంగా కొనసాగినా ఆయన ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం ఎమ్మెల్సీగా ఉంటూనే సీఎంగా సేవలు అందిస్తున్నారు.

2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీయూ కూటమి విజయం సాధించగా ఏ చట్ట సభలోనూ సభ్యత్వం లేని నితీశ్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2006లో మండలికి ఎన్నికైన నితీశ్ పదవీకాలం 2012వరకు ఉండగానే, 2010లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీయూ కూటమి మరోసారి అధికారంలోకి రాగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో మళ్లీ మండలికే ఎన్నికై.. ఇదేక్రమంలో 2013లో బీజేపీతో ఫ్రెండ్‌షిప్‌ను కట్ చేసుకున్నారు. 2014ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్లి ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంగా ఉన్న మాంఝీ 2015లో బహిష్కరణకు గురవ్వడంతో నితీశ్‌ నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాకూటమి విజయం సాధించిగా నితీశ్‌ ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉండగా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను కేబినెట్‌ నుంచి తొలగించడంతో ఆర్జేడీ అభ్యంతరం చెప్పింది. దీంతో 2017 జులైలో నితీశ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. కొద్ది గంటల్లోనే రాజకీయ సమీకరణాలు మారి ఎన్డీయేతో దోస్తీ కట్టిన నితీశ్‌ మళ్లీ సీఎం పీఠం దక్కించుకున్నారు.

అయితే… ప్రస్తుతం ఆర్జేడీ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌.. నితీశ్‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ప్రజలను నేరుగా ఎదుర్కొనేందుకు నితీశ్ భయ పడుతున్నారని.. రాష్ట్రంలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసురుతున్నారు. తేజస్వీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో స్పందిస్తున్న నితీశ్… తాను ఒక్క స్థానానికే పరిమితం కావాలనుకోవట్లేదని.. అందుకే పోటీ చేయట్లేదని చమత్కరిస్తున్నారు.

Advertisement

Next Story