టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి భూమా బ్రహ్మానందరెడ్డి?

by srinivas |   ( Updated:2021-06-20 06:25:55.0  )
టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి భూమా బ్రహ్మానందరెడ్డి?
X

దిశ, ఏపీ బ్యూరో: భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే రాజకీయారంగేట్రం చేశారు. 2017లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. భూమా నాగిరెడ్డి 2014లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందారు. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి శోభానాగిరెడ్డి కూడా ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసినా ప్ర‌చారం స‌మ‌యంలో జ‌ర‌గిన రోడ్డు ప్ర‌మాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి వైసీపీ త‌ర‌పున ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా కుటుంబం చంద్ర‌బాబు చెంత‌కు చేరిపోయింది.

మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇవ్వ‌డంతో భూమా నాగిరెడ్డి పార్టీ మారార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇంతలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్ర‌మంలో నంద్యాల‌కు 2017లో ఉప ఎన్నిక జ‌రిగింది. ఆ సమ‌యంలో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి ఈ ఉప ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని అనుకున్నారు. అయితే భూమా అఖిల ప్రియ మాత్రం వరసకు తనకు సోదరుడైన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంపై హామీల వర్షం కురిపించారు. అంతేకాదు క్షణాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అటు వైసీపీ ఇటు టీడీపీ ఇరు పార్టీలు కోట్లు కుమ్మరించాయని ప్రచారం ఉంది.

అంతేకాదు నంద్యాల ఉపఎన్నిక దేశంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనే అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నిక‌క‌గా రికార్డుల‌కు ఎక్కింది. చివరికి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘ‌న‌ విజ‌యం సాధించారు. 27 వేల ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు బ్రహ్మానందరెడ్డి. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ ఫాలోయింగ్ వచ్చింది. అనంతరం ఆయన కుటుంబం ఓ వెలుగు వెలుగొందింది. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఆధిపత్యపోరులో భూమా బ్రహ్మానందరెడ్డికి సొంత పార్టీ నేతలతోనే వివాదాలు ఏర్పడ్డాయి. చివరికి భూమా కుటుంబానికి అత్యంత ఆప్తుడు ఏవీ సుబ్బారెడ్డితోనూ గొడవలు తలెత్తాయి. దీంతో 2019 ఎన్నికల్లో పట్టుబట్టి టికెట్ సంపాదించుకున్నా జ‌గ‌న్ సునామీ ముందు కొట్టుకుపోయారు. ఆ నాటి నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే కర్నూలు జిల్లాలో నారా లోకేశ్ పర్యటనలో అసంతృప్తిగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఇమడలేక..ఆప్తులు దూరమై ఒంటరిగా మిగిలిపోయారు. నమ్ముకున్న కొందరు కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్ చూసుకుని వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. కొందరు వైసీపీలో చేరితో మరికొందరు బీజేపీలో చేరిపోయారు. దీంతో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఒంటరిగా నిలిచిపోయారు. రాజకీయ భవిష్యత్ ఉన్న అల్లుడు ఇలా మౌనంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారట బ్రహ్మానందరెడ్డి మామ, వైసీపీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి. కాటసాని బ‌న‌గాన‌ప‌ల్లె వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను వైసీపీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి భూమా బ్రహ్మానందరెడ్డి మామ కాటసాని రామిరెడ్డి సూచనలతో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా లేక ఒంటరిగా టీడీపీలో ఉంటూ పోరాటం చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.

Advertisement

Next Story

Most Viewed