బీహెచ్‌యూ ప్రొఫెసర్లుగా నీతా అంబానీ, ప్రీతి అదాని.. ఏం అర్హత ఉందంటున్న విద్యార్థులు

by Shamantha N |   ( Updated:2021-03-17 02:50:33.0  )
nita ambani and priti adani
X

దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ దేశంలోనే సంపన్న వ్యక్తులుగా ఉన్న ఇద్దరు కుబేరుల భార్యలు. కానీ కుబేరుల భార్యలుగానే మిగిలిపోకుండా ఇద్దరూ వ్యాపారంలో రాణిస్తున్నవారే. వాళ్లే నీతా అంబానీ, ప్రీతి అదాని. నీతా అంబానీ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య కాగా.. మరో వ్యాపారవేత్త గౌతం అదాని సతీమణి ప్రీతి. నిత్యం వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉండే వీళ్లిద్దరూ త్వరలో కొత్త పాత్ర పోషించబోతున్నట్టు సమచారం. నీతా, ప్రీతి ప్రఖ్యాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్లుగా చేరున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నీతూ అంబానీ, ప్రీతి అదానితో పాటు యూకెలో ఉంటున్న మరో సంపన్నుడు లక్ష్మీ మిట్టల్ భార్య ఉషా మిట్టల్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తున్నది. సోషల్ సైన్సైస్ విభాగంలో నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమించారని సమాచారం. అయితే దీనిపై రిలయన్స్ స్పందించింది. తమ ముందుకు అలాంటి ప్రతిపాదనేమీ రాలేదని తేల్చి చెప్పింది. అదాని సంస్థల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.

కాగా.. ఈ సంపన్నుల సతీమణుల నియామక వార్తలపై బీహెచ్‌యూ విద్యార్థులు భగ్గుమంటున్నారు. బీహెచ్‌యూలో విజిటింగ్ ప్రొఫెసర్లుగా ఉండటానికి వారికి ఏ అర్హత ఉన్నదని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు పలు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు బీహెచ్‌యూ వైస్ ఛాన్స్‌లర్ రాకేశ్ భట్నాగర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కాగా ఇదే విషయమై బీహెచ్‌యూ నియామక కోఆర్డినేటర్ ఎంఎస్ శర్మ స్పందిస్తూ.. ‘నీతా అంబానీ ఒక మహిళా పారిశ్రామికవేత్త. ఆమె మా క్యాంపస్‌లో జాయిన్ అయితే తన అనుభవం పూర్వాంచల్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని తెలపడం గమనార్హం.

Advertisement

Next Story