కాళేశ్వరం టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ రాస్తాం: భట్టి

by Shyam |   ( Updated:2020-05-09 08:14:43.0  )
కాళేశ్వరం టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ రాస్తాం: భట్టి
X

దిశ, న్యూస్‌ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ రాస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్షాలు, మీడియాను తిడితే అసలు విషయాలు బయటపడవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం పోలీసులను కాపాల పెట్టి మద్యం విక్రయాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చీప్ లిక్కర్ తాగే తాగుబోతులు భౌతిక దూరం ఎలా పాటించగలరు.?అని ప్రశ్నించారు. ఒక పక్కన తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టులకు రూ.21 వేల కోట్లతో టెండర్లు పిలవడం సబబు కాదన్నారు. కాళేశ్వరం కోసం టెండర్లు పిలవడం రిటైర్డ్ ఇంజినీర్ అసోషియేషన్ వ్యతిరేకిస్తోందని చెప్పారు.రాష్ట్రానికి ఇప్పటికే రూ.3.21 లక్షల అప్పులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక పరిస్థితి, టెండర్ల‌పై సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ రాస్తామని విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి లోన్స్ ఇస్తున్న సంస్థలు ప్రాజెక్టుల డీపీఆర్‌పై విచారణ చేయాలని కోరారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ,రాష్ట్రంలో ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇసుక తరలింపులో పనిచేసే కార్మికులకు ఎలాంటి టెస్టులు చేయడం లేదని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే వాటిలో చిన్న, సన్నకారు వ్యాపారులు పాత్ర కూడా కీలకమని ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం రూ. 1.70 కోట్లల ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శించారు. అపత్కాల పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌పై ఉందన్నారు. సింగపూర్, మలేషియా లాంటి చిన్న దేశాలు ఆయా దేశాల ప్రజలకు నమ్మకం కల్పించాయన్నారు. దేశంలో ప్రతి పేద కుటుంబానికీ రూ.7,500 నగదు ఇవ్వాలని రాహుల్ గాంధీ చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణల విషయంలో రాష్ట్రాల హక్కులను లాక్కునే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed