మేయర్ నుంచి వార్డుల దాకా ఒకటికి ఐదింతలు

by Anukaran |
మేయర్ నుంచి వార్డుల దాకా ఒకటికి ఐదింతలు
X

మొన్న ఐపీఎల్.. నిన్న దుబ్బాక.. నేడు బల్దియా. పోరు ఏదైనా పందెం కాయాల్సిందే అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. పలు సందర్భాల్లో బెట్టింగ్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినా ఆశించిన ఫలితం రాలేదు. అయితే ఇప్పటికే ‘గ్రేటర్’లో బెట్టింగ్ జోరు షురూ అయినట్టు తెలుస్తోంది. ఈసారి గట్టిగానే నిఘా పెట్టి పందెం రాయుళ్ల పని పడతామని పోలీసులు చెబుతున్నారు. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

దిశ, క్రైమ్ బ్యూరో : అక్రమ మార్గంలో అత్యంత సులభంగా డబ్బు సంపాదించే మార్గాలలో బెట్టింగ్ ప్రధానమైంది. అత్యధికంగా నిర్వాహకులకే మేలు చేసే విధంగా ఉండే ఈ బెట్టింగ్ దందా ఎన్నికల్లో మాత్రం నిర్వాహకుల చేతుల్లో గెలుపు ఓటముల నిర్ణయం ఉండే అవకాశం లేదు. పరిణామాలు, పరిస్థితులు అత్యంత రసవత్తరంగా, నువ్వా.. నేనా అనేలా కొనసాగిన దుబ్బాక ఉప ఎన్నికపై బెట్టింగ్‌ దందా జోరుగానే కొనసాగినట్టు వార్తలు వచ్చాయి. అదే తరహాలో జీహెచ్ఎంసీ ఎన్నికలూ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు బల్దియా గెలుపు సవాల్ గా మారింది. గ్రేటర్ పోరులో దుబ్బాక ప్రభావం లేకుండా ఉండేందుకు టీఆర్ఎస్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. దుబ్బాక ఫలితమే బల్దియాలో వస్తోందంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆసక్తిగా మారుతున్న బల్దియా రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. నగరంలోని 150 డివిజన్లలో మెజార్టీ డివిజన్లను గెలుపొంది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని రాజకీయ పక్షాలు మాటల తూటాలను శ్రీకారం చుట్టాయి. దీంతో జీహెచ్ఎంసీ రాజకీయం రోజురోజుకూ మరింత రసకందాయంగా మారుతోంది.

ఒకటికి ఐదింతలు..

రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుత గ్రేటర్ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ప్రస్తుత ఎన్నికలు 2023 సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అందుకే 2020 గ్రేటర్ పోరు 2020 క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రెట్టింపు స్థాయిలో పందెం కాసే బెట్టింగ్ రాయుళ్లు ఒకటికి ఐదింతలు బెట్టింగ్ లకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ లకు పాల్పడేది అత్యధికంగా వ్యాపారస్తులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు కావడంతో ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో బెట్టింగ్ భారీ స్థాయిలోనే జరుగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో అన్ని అంశాలతో పాటు బెట్టింగ్ ను కూడా చాలా సీరియస్‌గానే తీసుకుంటామని, కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story