బెంగళూరు ఎఫ్‌సీ అద్భుత విజయం

by Shyam |
బెంగళూరు ఎఫ్‌సీ అద్భుత విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా గోవాలోని ఫటోర్డా స్టేడియంలో ఆదివారం రాత్రి కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 4-2 తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి కేరళ బ్లాస్టర్స్ కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. తొలి నిమిషం నుంచే కేరళ బ్లాస్టర్స్ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో 17వ నిమిషంలో కేరళ ఆటగాడు రాహుల్ ప్రవీణ్ గోల్ చేశాడు. దీంతో ఆధిక్యత 1-0కు పెరిగింది.

ఆ తర్వాత బెంగళూరు కూడా దూకుడుగా ఆడటం మొదలు పెట్టింది. పలుమార్లు బంతిని గోల్ పోస్టుకు తరలించడానికి ప్రయత్నించింది. అయితే 29వ నిమిషంలో బెంగళూరు ఆటగాడు క్లిటన్ సిల్వ గోల్ చేయడంతో 1-1తో స్కోర్లు సమం అయ్యాయి. ఇక తొలి అర్ద భాగం ముగిసే వరకు ఎవరూ గోల్స్ చేయలేదు. రెండో అర్ధ భాగంలో బెంగళూరు దూకుడు పెంచింది. 51వ నిమిషంలో క్రిస్టియన్, 53వ నిమిషంలో దిమాస్ దెల్గాడో గోల్స్ చేసి బెంగళూరు ఆధిక్యాన్ని 3-1కి పెంచారు.

ఇక ఆధిక్యతను తగ్గించడానికి కేరళ బ్లాస్టర్స్ తీవ్రంగా ప్రత్నించింది. 61వ నిమిషంలో కేరళ ఆటగాడు విన్సెంట్ గోమోజ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. అయితే 65వ నిమిషంలో బెంగళూరు కెప్టెన్ సునిల్ ఛత్రి గోల్ చేయడంతో ఆధిక్యం 4-2కు పెరిగింది. ఆ తర్వా ఇరు జట్లు గోల్స్ చేయడానికి తీవ్రంగా శ్రమించి విఫలమయ్యాయి. దీంతో బెంగళూరు జట్టు 4-2 తేడాతో కేరళపై విజయం సాధించింది. కేరళకు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్, చెన్నయిన్ ఎఫ్‌సీ తలపడ్డాయి. ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం అవడంతో 0-0 స్కోర్‌తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Advertisement

Next Story