‘మోడీ దేశం’గా మారడం ఖాయం : బెంగాల్ సీఎం

by Shamantha N |   ( Updated:2023-10-12 06:58:19.0  )
Mamata Banerjee
X

కోల్‌కతా: భారతదేశం పేరును ప్రధాని మోడీ మార్చేస్తారనీ, త్వరలోనే మనదేశం ‘మోడీ దేశం’గా మారడం ఖాయమని అన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆరోజు ఎంత దూరంలో లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ప్రధానిపై నిప్పులు చెరిగారు. దీదీ మాట్లాడుతూ.. ‘ప్రధాని అహ్మదాబాద్‌లో స్టేడియానికి మోడీ స్టేడియంగా పేరు పెట్టుకున్నారు. కొవిడ్ సర్టిఫికెట్లపై ఆయన ఫోటోలను ముద్రించుకుని దానిని మోడీ వ్యాక్సిన్‌గా ప్రచారం చేసుకుంటున్నారు.

అంతరిక్షంలోకి ఆయన ఫోటోలను పంపించుకుంటున్నారు. త్వరలోనే భారత్ పేరును కూడా మోడీ దేశంగా మార్చుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు..’ అంటూ వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో ఆదివారం బ్రిగేడ్ మైదానంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. బ్రిగేడ్ మైదానాన్ని ఆయన బి-గ్రేడ్ మైదానంగా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ అగ్రనాయకులకు బెంగాల్ గుర్తుకువస్తుందని ఎద్దేవాచేశారు. మహిళల భద్రత గురించి ఆయన (మోడీ) బెంగాల్ ప్రజలకు ఉపన్యాసాలు ఇస్తున్నారనీ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆడవాళ్లకు రక్షణ ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. మోడీకి ఇష్టమైన గుజరాత్‌లో కూడా మహిళలకు భద్రత కరువైందని దీదీ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed