లాక్‌డౌన్ వల్ల కాపాడిన ప్రాణాలెన్నో తెలుసా ?

by Shamantha N |
లాక్‌డౌన్ వల్ల కాపాడిన ప్రాణాలెన్నో తెలుసా ?
X

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఎన్ని ఇబ్బందులెదురైనా అందరూ ఇళ్లకే పరిమితమై లాక్‌డౌన్ పాటించారు. రోజువారీ పనులను త్యాగం చేశారు. అయితే వారు చేసినదానికి ప్రతిఫలం ఉందా? ఇంట్లోనే ఉండి సూపర్‌హీరోలుగా మారి ప్రజలను కాపాడారా? అంటే అవుననే చెబుతోంది భారతీయ స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ. వివిధ గణన విధానాల ద్వారా లెక్కించిన సమాచారం ప్రకారం లాక్‌డౌన్ పాటించడం వల్ల 37,000 – 71,000 మందిని కాపాడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో లక్ష పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకవేళ లాక్‌డౌన్ పాటించకపోయి ఉంటే మాత్రం కేసుల సంఖ్య 14 నుంచి 29 లక్షలు దాటేవని తెలిపింది. మార్చి 25 నుంచి మే 15 మధ్య కాలాన్ని అంచనాగా తీసుకుని ఈ లెక్కలు వేశారు. కచ్చితంగా చెప్పాలంటే 68,000 మరణాలు సంభవించి ఉండేవని ఇద్దరు ఆర్థికవేత్తలు వేసిన మోడల్ ద్వారా తెలిసిందని స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ప్రవీణ్ శ్రీవాస్తవ అన్నారు.

ఇదే విషయం మీద రీసెర్చ్ చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లెక్కల ప్రకారం.. లాక్‌డౌన్ పాటించడం వల్ల ఏకంగా 1,20,000 – 2,10,000 మంది ప్రాణాలు కాపాడగలిగినట్లు వెల్లడైంది. ఇక పాజిటివ్ కేసులు ఏకంగా 3 నుంచి నాలుగు లక్షలు దాటిపోయేవని తేలింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం 78,183 ప్రాణాలను కాపాడినట్లు చెప్పింది. ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం లాక్‌డౌన్ పాటించడం వల్ల ఏప్రిల్ 3న 22 శాతం ఉన్న కేసుల పెరుగుదల 5.4 శాతానికి పడిపోయింది. కేసు డబ్లింగ్ రేట్ 3.5 రోజుల నుంచి 13.5 రోజులకు చేరుకుంది. ఇలా ఏ లెక్క ప్రకారం చూసినా లాక్‌డౌన్ కారణంగా చాలా మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలా లాక్‌డౌన్‌కు సహకరించిన ప్రతి ఒక్కరి దిశ చెబుతోంది హ్యాట్సాఫ్.

Advertisement

Next Story

Most Viewed