కరోనా రిలీఫ్‌ ఫండ్.. యాచకుడి విరాళం రూ.లక్ష

by Shamantha N |
కరోనా రిలీఫ్‌ ఫండ్.. యాచకుడి విరాళం రూ.లక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ ప్రజల నుంచి బడాబడా నేతలు, ప్రముఖులు సైతం కరోనా గుప్పిట్లో బంధీలుగా మారుతున్నారు. ఈ మహమ్మారి మనుషుల మధ్య అంతరాన్ని పెంచుతోంది. అంతేకాకుండా కరోనా బారిన పడి ఎవరైనా మృతి చెందితే, నా అనే వాళ్లు ఎవరూ దగ్గరకు రాకపోవడంతో దిక్కులేని మృతదేహంగా మారి, మున్సిపాలిటీ వాళ్లు ఖననం చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.

ఈ ఘటనలన్నీ చూసి చలించిపోయిన ఓ యాచకుడు కరోనా సహాయ నిధికి రూ. లక్ష విరాళం ప్రకటించాడు.సమాజం పట్ల అతడి ఔదర్యాన్ని ప్రశంసించిన జిల్లా కలెక్టర్ అతడికి సామాజిక కార్యకర్తా అన్న బిరుదుతో సత్కరించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన పూల్‌పాండియన్ అనే వ్యక్తి యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రజలు మరణించడాన్ని చూసి అతడు చలించిపోయాడు. ఈ నేపథ్యంలో తనవంతు సాయంగా మే నెలలో రూ. 10వేల విరాళం ప్రకటించగా.. గత 3నెలల్లో భిక్షాటన ద్వారా వచ్చిన రూ.90 వేలను మంగళవారం మధురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆ డబ్బును కరోనా నిధికి విరాళంగా ఇచ్చాడు.

కరోనా కట్టడికి పూల్‌పాండియన్ అందించిన సాయాన్ని మెచ్చుకున్న జిల్లా కలెక్టర్ ఆయనను సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ ఒక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అది చూసిన పాండియన్ ఆనందం వ్యక్తం చేశాడు. కలెక్టర్ తనకు సామాజిక కార్యకర్త అన్న బిరుదు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed