ఇది గర్వపడే నెల..

by sudharani |
ఇది గర్వపడే నెల..
X

టిమ్ కుక్, ఎలెన్ డిజెనరీస్, లిల్లీ సింగ్.. ఈ ముగ్గురు వారి వారి రంగాల్లో పేరు పొందినవారు. ‘ఏక్ లడ్ఖీ కో దేఖాతో ఐసా లగా, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్..’ ఈ రెండు సినిమాలు విలక్షణమైనవి, ఇంద్రధనుస్సు రంగు జెండా.. ఇది విభిన్న విప్లవానికి సూచిక. వీటన్నింటికి ఉన్న సంబంధం దాదాపు అందరికీ తెలుసు. కానీ ధైర్యంగా బయటికి చెప్పలేరు. చెప్పినా కూడా ఎక్కువసేపు ఆ విషయాల గురించి చర్చించలేరు. చర్చించినా గట్టిగా బయటికి మాటలు రావు. మాట్లాడినా చుట్టుపక్కల వారెవరైనా వింటున్నారా అనే భయం. ఇంక ఎవరన్నా చూస్తున్నారని తెలిస్తే వెంటనే కళ్లు తిప్పుకుని పక్కకి తప్పుకుని మాట మార్చేస్తారు. కానీ ఈ నెలలో అలా చేయాల్సిన అవసరం లేదు. ఇది గర్వపడే నెల. వారి భాషలో చెప్పాలంటే ఇది ప్రైడ్ మంత్. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి అవగాహన పెంచుకుంటూ, హోమోఫోబియాను దూరం చేస్తూ, ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో ధైర్యంగా గర్వపడుతూ చర్చించుకోవాల్సిన నెల. ఈ సందర్భంగా వారి కమ్యూనిటీ గురించి అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తే అపోహలు దూరం చేసుకునే అవకాశం కలుగుతుంది. అలా అర్థం చేసుకోవాలంటే ముందు వారు ఉపయోగించే టెర్మినాలజీ తెలియాలి. అందరూ ఒకటే అనే అపోహ కారణంగా వారిని తప్పుగా అర్థం చేసుకునే ధోరణి నుంచి బయటపడాలి.

అత్యున్నత న్యాయస్థానం 2018, సెప్టెంబర్ 6న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 377ను డీక్రిమినలైజ్ చేసింది. అప్పటివరకు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించేవారు, కానీ ఇప్పుడు ఎంతో మంది స్వలింగ వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఇంకా అలాగే ఉంది. ఆ మూఢనమ్మకం అలాగే కొనసాగుతోంది. ఆ వివక్ష అలాగే ఉంది. ‘నేను అది’ అని ధైర్యంగా చెప్పిన వాళ్లను భరితెగించారు అంటున్నారు. అది సహజం అని అర్థం చేసుకున్నవాళ్లు చాలా తక్కువ. దీనంతటికీ కారణం సమాజంలో వారి మీద సకారాత్మక అభిప్రాయం లేకపోవడమే. కానీ వారిలో విభిన్న రకాల వారుంటారని, వారిలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పరిస్థితి అని అర్థం చేసుకోగలిగితే, ఈ సమస్య ఉండదు. ఎవర్ని ఎలా చూడాలో సమాజానికి అర్థమవుతుంది.

1. అసెక్సువల్

తమని తాము ‘అసెక్సువల్’ అని చెప్పుకునే వారు మగ లేదా ఆడ ఎవరితోనూ ఎలాంటి లైంగిక ఆకర్షణకు లోనుకారని అర్థం. వారి భావోద్వేగాల పరంగా ఫీలింగ్స్ ఉంటాయి కానీ, శారీరక సహజ లైంగిక భావాలు ఉండవు. దీన్ని నపుంసకత్వంతో అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇవి రెండూ వేర్వేరు. నపుంసకత్వాన్ని వారే స్వయంగా ఎంచుకుంటారు, కానీ అసెక్సువాలిటీ అనేది ఒక గుర్తింపు మాత్రమే. వీరికి ప్రత్యేకంగా ఒక జెండా ఉంది. పై నుంచి
కిందికి నలుపు, బూడిద, తెలుపు, ఊదా రంగుతో ఈ జెండా ఉంటుంది. వీరి గుర్తు నలుపు రంగు వృత్తం.

2. అజెండర్

అజెండర్ అంటే లింగం లేనిది అర్థం. దీన్ని అసెక్సువల్‌తో పాటు ఉపయోగించవద్దు. వీరిని వీరు మగ గానీ, ఆడ గానీ కాదు అని పరిగణిస్తారు. పురుష వచనంతో గానీ, స్త్రీ వచనంతో గానీ పిలిపించుకోవడానికి వారు ఇష్టపడరు. వీరిని న్యూట్రల్ జెండర్ అని గానీ, జెండర్‌లెస్ అని గానీ అంటారు.

3. బైసెక్సువల్

భావోద్వేగాల పరంగా, లైంగికంగా అటు ఆడవాళ్లకి, ఇటు మగవాళ్లకి ఇద్దరికీ ఆకర్షితులయ్యేవారిని బైసెక్సువల్ అంటారు. ఇది చాలా సాధారణం. కానీ ఈ ఆకర్షణ అనేది ఇద్దరి వైపూ ఒకే విధంగా ఒకే స్థాయిలో ఆకర్షితులవ్వాలని లేదు. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు తమని తాము బైసెక్సువల్ అని కూడా చెప్పుకుంటారు.

4. సిస్‌జెండర్

పుట్టుకతో వచ్చిన లింగానికి తగ్గట్టుగా కనిపించేవారిని సిస్‌జెండర్‌గా పరిగణిస్తారు. అంటే సంప్రదాయవాదుల ప్రకారం ఉన్న మగ, ఆడ లింగాలను సిస్‌జెండర్ అనొచ్చు.

5. డెమిసెక్సువల్

బలమైన భావోద్వేగ బంధం ఏర్పడిన తర్వాతనే లైంగిక చర్యకు ఆసక్తిచూపించేవారిని డెమిసెక్సువల్ అంటారు. మొదట్లో వీరు ఏ జెండర్‌కి ఆకర్షితులవరు. వారి లైంగిక భాగస్వామి మీద ఒక స్పష్టత ఉండదు. కానీ స్నేహంతో డెమిసెక్సువాలిటీ బయటపడుతుంది. స్నేహం బలపడి వారితో బంధం గట్టిగా బలపడిన తర్వాత వాళ్లు ఎక్కడ విడిపోతారేమోనని లైంగికవాంఛను బయటపెడతారు.

6. ప్యాన్‌సెక్సువల్

దీన్ని ఎక్కువగా బైసెక్సువల్‌తో జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. బైసెక్సువల్ అంటే ఆడ, మగ ఇద్దరి మీదా లైంగిక, భావోద్వేగాలను చూపిస్తారు. కానీ ప్యాన్‌సెక్సువల్ వాళ్లకు ఆడ, మగ, న్యూట్రల్ జెండర్.. ఇలా ఏ లింగం అనేది సంబంధం లేదు.

7. ఇంటర్‌సెక్స్

కొంతమంది పురుషులుగా పుట్టినప్పటికీ వారిలో ఆడవాళ్లలో మాదిరిగా శరీరం కనిపిస్తుంది. అలాగే కొంతమంది ఆడవాళ్లలో మగవారి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. వీరికి లైంగికపరంగా సాధారణ లక్షణాలే ఉంటాయి. కానీ శరీరాకృతిలో మాత్రం కొంచెం అన్యలింగ లక్షణాలు కనిపిస్తాయి. ఇందుకు వారిలోని హార్మోన్లు, క్రోమోజోమ్‌లు, జన్యువులు ప్రధాన కారణంగా నిలుస్తాయి.

8. గే

ఈ కమ్యూనిటీకి చెందిన ప్రతి ఒక్కరినీ ‘గే’ అని సంబోధిస్తుంటారు. కానీ అది తప్పు. గే అంటే ప్రత్యేకంగా ఒక మగాడు, మగాడికి ఆకర్షితుడవడమే. అలాంటి వారిని మాత్రమే ‘గే’ అనాలి.

9. లెస్బియన్

అమ్మాయి, అమ్మాయికి లైంగికంగా ఆకర్షితమైతే లెస్బియన్ అని పిలుస్తారు.

10. హోమోసెక్సువల్

గే, లెస్బియన్ ఇద్దరినీ కలిపి ‘హోమోసెక్సువల్’ అని సంబోధిస్తారు. ఈ కమ్యూనిటీ వాళ్లందరినీ ఈ పదాన్ని ఉపయోగించి సంబోధించవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా క్వీర్ అని, ట్రాన్స్‌జెండర్ అని, క్వశ్చెనింగ్ అని చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎవరి ప్రత్యేక లక్షణాన్ని బట్టి వారికి పేర్లు ఉన్నాయి. పేర్లు విభిన్నంగా ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న వివక్ష ఒకేలా ఉంది. రైళ్లలో తప్పుగా ప్రవర్తించే ఒకరిద్దరి కారణంగా ఇలా మొత్తం కమ్యూనిటీని తప్పుబట్టడం సరికాదు. ఇదే కమ్యూనిటీకి చెందిన వాళ్లమని ధైర్యంగా చెబుతూ ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల వైపు నుంచి ఆలోచించినపుడు ఏదీ తప్పుగా అనిపించదు. కాబట్టి ఈ ప్రైడ్ మంత్‌ని మరింత గర్వపడే నెలగా చేయడానికి ప్రయత్నిద్దాం.

Advertisement

Next Story

Most Viewed