IPL ఫేజ్ 2 : ప్లేయర్స్‌పై BCCI స్పెషల్ ఫోకస్.. అలా చేస్తే కఠిన చర్యలు.!

by Anukaran |
IPL ఫేజ్ 2 : ప్లేయర్స్‌పై BCCI స్పెషల్ ఫోకస్.. అలా చేస్తే కఠిన చర్యలు.!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 నిర్వహణకు అంతా సిద్ధమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి క్రికెట్ అభిమానులకు మజా అందించేందుకు ఐపీఎల్ 14 సీజన్ మళ్లీ తిరిగిరానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడగా.. రెండో దశ మ్యాచ్‌లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీసీఐ చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా ఆటగాళ్లకు కఠిన నిబంధనలు పెట్టింది. ఆటగాళ్లు బయోబబుల్ దాటకుండా వారిని ఓ కంట కనిపెట్టేందుకు బబుల్ మేనేజర్స్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. వీరు ఆటగాళ్ల కదలికలపై ఫోకస్ పెట్టడంతోపాటు ఉల్లంఘనలపై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తారు.

సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 14 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు దుబాయ్‌ చేరుకుని సాధన మొదలుపెట్టాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ క్రమంలో నెల రోజుల ముందుగానే ఈ రెండు జట్లు దుబాయ్‌ వెళ్లాయి. అయితే, రెండో దశ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకాలు కల్గకుండా బీసీసీఐ కఠిన చర్యలు చేపడుతున్నది.

ఇప్పటికే పలు నిబంధనలకు రూపకల్పన చేయగా.. తాజాగా ఆ జాబితాలో మరికొన్ని జతచేసింది. ఈ సారి 14 బయోబబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి. 8 ఫ్రాంచైజీల కోసం కాగా, మిగిలినవి మ్యాచ్ అధికారులు, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, కామెంటేటర్ల కోసం కేటాయించారు. బంతికి ఉమ్మి రుద్దడాన్ని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, పదే పదే ఈ చర్యకు పాల్పడితే బౌలింగ్ జట్టుకు 5 పరుగుల జరిమానా విధించనున్నారు. అలాగే, స్టాండ్స్‌లోకి వెళ్లిన బంతిని కాకుండా, కొత్త బంతితో బౌలింగ్ చేయిస్తారు. ఆ బంతిని శానిటేషన్ చేసి బాల్ లైబ్రరీకి పంపుతారు. ఈ సారి మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడంతో ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా కారణంతో బయోబబుల్ దాటి వెళ్తే క్వారంటైన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.

అలాగే, ఆరు సార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావాలి. అయితే, తాజాగా ఈ నిబంధనల జాబితాలో బీసీసీఐ మరికొన్నింటిని జత చేసింది. ఆటగాళ్ల కుటుంబసభ్యులు సైతం బబుల్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. వారు బబుల్ వీడాలంటే ముఖ్యమైన విషయం కావడంతోపాటు బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనుమతి తీసుకోవాలి. హోటల్ రూంలో సైతం ఆటగాళ్లను ఎవరూ కలిసేందుకు వీల్లేదు. దీని కోసం జట్లు హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకోవాలని బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీలకు సూచించింది. బయోబబుల్‌ ప్రవేశానికి ముందు 7 రోజుల వ్యవధిలో మూడు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు కచ్చితంగా ఉండాలని బీసీసీఐ రూల్స్ పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed