క్రికెట్ అసోసియేషన్ల ఆదాయానికి గండి !

by Shamantha N |
క్రికెట్ అసోసియేషన్ల ఆదాయానికి గండి !
X

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐకి అనుబంధంగా ఉన్న వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లను కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ అసోసియేషన్లకు గత కొన్నేండ్లుగా ఐపీఎల్ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆయా ఫ్రాంచైజీలు రాష్ట్ర అసోసియేషన్లకు భారీ మొత్తాలనే చెల్లిస్తూ స్టేడియాలు, ఇతర వసతులను అద్దెకు తీసుకుంటున్నాయి. అంతే కాకుండా రాయల్టీ రూపంలోనూ భారీగానే సొమ్ములు అందుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌ల రద్దుతో పాటు బీసీసీఐ.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో బీసీసీఐకి రూ.3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. కాగా, ప్రతీ ఏడాది రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ కేటాయించే నిధులకు ఈసారి కోతపడే అవకాశం ఉంది.

బీసీసీఐకి అనుబంధంగా ఉన్న హైదరాబాద్, తమిళనాడు క్రికెట్ అసోషియేషన్లతో పాటు కర్ణాటక, ముంబై, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్లు ఐపీఎల్ ద్వారా అదనపు నిధులను సమకూర్చుకుంటున్నాయి. కానీ, ప్రస్తుతం ఇటు ఐపీఎల్ డబ్బులు రాక.. అటు బీసీసీఐ నిధుల్లో కోత పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర సంఘాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే స్టేడియాల నిర్వహణ, ఉద్యోగులు, ఇతర సిబ్బంది వేతనాలకు నిధులు లేక పలు సంఘాలు సతమతమవుతున్నాయి. ముఖ్యంగా రెండేళ్లుగా నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హెచ్‌సీఏకు ఐపీఎల్ వాయిదా మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనుంది. అయితే, బీసీసీఐ.. రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ఇబ్బందులను గుర్తించి, పరిష్కారం చూపాలని క్రికెట్ పెద్దలు కోరుతున్నారు.

Tags :BCCI, State Cricket Associations, IPL, Lack of Funds, Franchisees

Advertisement

Next Story