ఆ ఉత్తర్వుల మర్మమేంటి.. ఆ కార్పొరేటర్ ఓసీ కాదా?

by Sridhar Babu |
Corporation kola malathi
X

దిశ, కరీంనగర్ సిటీ: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇటీవల వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక వర్గ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు వారి దరికీ చేర్చాల్సిన ఆ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు, బీసీల ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాకుండా, ఆ కోటాలో పదవులు, పదోన్నతులు, రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోకుండా, పైపెచ్చు వారిని వెనుకేసుకొస్తుండటం వెనుక దాగి ఉన్న మర్మం అంతుపట్టడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతేడాదిన్నర క్రితం జరిగిన బల్దియా ఎన్నికల్లో, స్థానిక 6వ డివిజన్ బీసీలకు కేటాయించారు. అయితే, ఓసీ అయిన కోల మాలతి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినట్లుగా ధ్రువీకరణపత్రం పొంది, అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

caste, Certificate Cancelled

దీనిపై అదే డివిజన్‌కు చెందిన సాదవేని వినయ్ అనే యువకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సదరు కార్పొరేటర్ బీసీ కాదు ఓసీ అంటూ విచారణలో తేలగా, ఆమె పొందిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ మార్చి 17న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై చర్చించి, చర్యలు తీసుకునేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో, కలెక్టర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ కార్పొరేటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో వెంటనే స్పందించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంబంధిత కార్పొరేటర్ మాలతి కోర్టుకెళ్లిన దృష్ట్యా జిల్లా కలెక్టర్ విడుదల చేసిన రద్దు ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్టాలంటూ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం ఆఘమేఘాలమీద గత నెల 1న మెమో జారీ చేశారు.

అయితే, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అమలు చేయాలంటూ ఒత్తిడి చేయాల్సిన ఆ శాఖ, తప్పుడు ధ్రువీకరణ పత్రం పొందిన కార్పొరేటర్‌కు పరోక్ష మద్దతు తెలుపుతుండటం వెనుక అధికార నేతల ఒత్తిడి పని చేసిందా? లేక కార్పొరేటర్ నిజంగానే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు ఏదేని అన్యాయం జరిగినా ఆ మరుక్షణమే రోడ్డెక్కి ధర్నాలు చేయటం, పత్రికా ప్రకటనలు విడుదల చేసే బీసీ సంఘాలు, ఈ ఉదంతంపై స్పందించకపోవటం కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పెండింగ్ మెమో విడుదలై నెల 15 రోజులు దాటినా ఇప్పటివరకు నోరెత్తి పోవటం పట్ల బీసీ సామాజిక వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా, ఈ తతంగానికంతటికీ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కారణమంటూ, తాను బీసీ బిడ్డనే అని చెప్పుకునే మంత్రి బీసీలను కూడా అణిచివేస్తూ, ఓసీలకు మద్దతుగా నిలుస్తున్నాడనేందుకు, జరుగుతున్న సంఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని, సోషల్ మీడియాలో విమర్శలు చక్కర్లు కొడుతుండటం గమనార్హం.

Advertisement

Next Story