కొత్త రంగులొద్దుకున్న కోమటి చెరువు.. జిగేల్‌మన్న నెక్లెస్ రోడ్డు

by Shyam |   ( Updated:2021-10-14 11:50:19.0  )
కొత్త రంగులొద్దుకున్న కోమటి చెరువు.. జిగేల్‌మన్న నెక్లెస్ రోడ్డు
X

దిశ, సిద్ధిపేట : పెత్ర అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఆనందహేల, తొమ్మిది రోజుల పాటు ఘనంగా కొనసాగింది. ఎనిమిది రోజుల పాటు సాగిన వేడుకంతా ఒక ఎత్తయితే, తొమ్మిదోరోజు అష్టమి రోజున జరిగే సద్దుల బతుకమ్మ సంబురాలు హైలెట్ అని చెప్పాలి.జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఉదయం నుంచే సద్దుల బతుకమ్మ పండుగ సందడి అట్టహాసంగా కొనసాగింది. వేలాది బతుకమ్మలను పేర్చి సిద్ధం చేసుకున్న మహిళలు, సాయంత్రం 4 గంటలకు వివిధ వాడల్లో నుంచి బతుకమ్మలను ఎత్తుకుని ర్యాలీగా మినీ ట్యాంక్‌ బండ్‌- కోమటి చెరువు వద్దకు బయలుదేరారు.బతుకమ్మలను చెరువు పరిసరాల్లో పెట్టి నిష్ఠతో పూజలు చేస్తూ.. అక్కా, చెల్లెళ్లు, మహిళలు కోలాటాలతో బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. సిద్ధిపేట పట్టణంలోని ప్రతీ గల్లీల్లో లక్షలాది బతుకమ్మలు కొలువుదీరాయి. ప్రధానంగా కోమటి చెరువు వద్ద బతుకమ్మ వేడుకలకు ఇబ్బంది కలగకుండా మంత్రి హరీశ్ ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేయించారు.

బతుకమ్మ సంబురాల్లో మంత్రి హరీశ్ రావు

కోమటి చెరువు వద్ద వేలాదిగా తరలి వచ్చిన మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు భార్య శ్రీనిత, కుమార్తె వైష్ణవితో కలిసి పండుగ సంబురాల్లో పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి సతీమణి శ్రీనిత క్యాంపు నివాసంలో బతుకమ్మ ఆటలు ఆడారు. హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక బతుకమ్మలను చూసి.. అందులో బాగున్న వాటిని సెలెక్ట్ చేసి కుటుంబ సమేతంగా మంత్రి వారికి బహుమతులను అందజేశారు. అనంతరం కోమటి చెరువు ప్రాంగణంలో మంత్రి సతీమణి, కూతురు వైష్ణవి, మున్సిపల్ చైర్మన్ మంజుల, కౌన్సిలర్లు కవితలు కాసేపు బతుకమ్మ ఆటపాటలతో ఆడిన అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

కుటుంబంతో మంత్రి బోటు షికారు..

కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కాసేపు బోట్ షికారు చేశారు. ఘాట్ల వద్ద గంగమ్మ ఒడిలోకి బతుకమ్మలను వదులుతున్న ప్రజలకు సతీ సమేతంగా అభివాదం చేశారు. ఆ తర్వాత పండుగ సందర్భంగా వచ్చిన ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరించారు. సద్దుల బతుకమ్మ స్పెషల్ మహిళలు ఇచ్చిన మల్లీద ముద్దలను తిన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బతుకమ్మ పండుగను ఆడపడుచులు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. సిద్ధిపేట కోమటి చెరువు వద్ద ఇక్కడి ఆడపడుచులతో కలిసి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్తిస్తున్నానని తెలిపారు.

Advertisement

Next Story