50 ఏళ్ళ చరిత్ర.. కనుమరుగవుతున్న ఆనవాళ్లు.. ఎవరైనా కరుణిస్తారని ఎదురుచూపులు?

by Anukaran |
50 ఏళ్ళ చరిత్ర.. కనుమరుగవుతున్న ఆనవాళ్లు.. ఎవరైనా కరుణిస్తారని ఎదురుచూపులు?
X

దిశ, సత్తుపల్లి టౌన్ : అవును నేనే శ్రీ బండి శోభనా చలం జూనియర్ కళాశాలను.. ఎప్పుడో పందొమ్మిది వందల డెబ్భై సంవత్సర కాలంలో సుమారు యాభై ఏళ్ల కిందట విజయవాడ పట్టణానికి చెందిన బండి శోభనా చలం దాతృత్వం వల్ల ఏళ్ల తరబడి కళాశాల తరగతులకు నోచుకోని సత్తుపల్లి ప్రాంతంలో ఏకైక జూనియర్ కళాశాలగా పురుడుపోసుకొన్నాను.. అప్పటి నుంచి ఎంతో మందికి చదువుల విలువలు నేర్పాను, ఉన్నత చదువులకు పూల బాటలు వేసాను. ఎంతో మంది జీవితాలకు చదువుల ఆర్థిక భరోసా ఇచ్చాను. నా ద్వారా విద్యాభివృద్ధిలో సత్తుపల్లి ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాను. నా దగ్గర చదువుకున్న ఎన్నో విద్యా కుసుమాలు అనేక ప్రాంతాలల్లో తమ ఉనికిని చాటుకుంటేనే ఉన్నారు. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ శాఖలలో ఉన్నతమైన స్తానాల్లో ఉండి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉండి సువాసనల పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాను. ఎందరినో జిల్లా, రాష్ట్ర, జాతీయ, రాజకీయ నాయకులను తయారు చేసాను. ఎంతోమంది ఇంజినీర్లను, డాక్టర్లను, ఉపాధ్యాయులను చేసాను. నా దగ్గర చదువుకున్న ఎంతో మంది నా బాల్య విద్యార్థులు ఇప్పుడు నా దగ్గరే పని చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వైద్యులు మట్టా దయానంద్, క్రిష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ప్రముఖ హెటేరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి, తెలంగాణా రాష్ట్ర టీఎస్పీఎస్ మెంబర్ బండి లింగారెడ్డి లాంటి వాళ్ళేగాక ఈ ప్రాంతంలో ఉన్న ఎంతో మంది ప్రముఖులు నా దగ్గరే చదువుకున్నారు..

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. ఒకప్పుడు గర్వంగా తలెత్తుకున్న నేను ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నా దగ్గర సుమారు ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరూ నిరుపేదలు. బయట చదువును కొనుక్కోలేక.. నన్ను నమ్ముకుని వచ్చారు. కానీ నా పరిస్థితి చూస్తే పాడుబడిన గోడలు, కిటికీలు లేవు, పగిలిపోయిన రేకులతో ఎండొచ్చిన, వానోచ్చిన నిలువ నీడ లేక అల్లాడుతున్నాను. రాను రాను నా మనుగడ సాగదేమోనని భయపడుతున్నాను.

నా చిరునామా చిరిగిపోతుందేమో అని ఆవేదన కలుగుతుంది. అందుకే నా ఉనికిని కాపాడుకోటానికి రాజకీయ నాయకులను, అధికారులను, స్థానిక నియోజకవర్గ ప్రతినిధిని పలుమార్లు కలిసి నా దుస్థితిని విన్నవించాను. ఎవరూ నా మీద దయ చూపలేదు సరికదా కనికరించనూలేదు. కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే ప్రజల ముందుకు వస్తున్నాను. దయచేసి మీరన్న నన్ను కాపాడి భవిష్యత్ తరాలకు భరోసా కల్పించండి. ఈ ప్రాంతానికి నా వంతు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ప్లీజ్.. మీ బండి శోభనా చలం ప్రభుత్వ జూనియర్ కళాశాల, సత్తుపల్లి..

Advertisement

Next Story

Most Viewed