40 రోజులుగా బాల్క సుమన్ ఎక్కడ..?

by Anukaran |   ( Updated:2021-04-05 01:40:01.0  )
40 రోజులుగా బాల్క సుమన్ ఎక్కడ..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బాల్క సుమన్.. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్.. ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. అందరికీ సుపరిచితుడే.. అదీకాక కేసీఆర్ కుటుంబానికి.. అందులోనూ యువనేత కేటీఆర్ కోటరీలో అత్యంత కీలక వ్యక్తి.. రాష్ట్ర స్థాయిలో పార్టీ బాధ్యతల్లో బిజీబిజీగా ఉన్న నేత.. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్క సుమన్.. తనను గెలిపించిన ప్రజలు, ఓటర్లకు మాత్రం దూరంగానే ఉంటున్నారనే విమర్శలున్నాయి. నెలకు సగటున నాలుగైదు రోజులే సెగ్మెంటుకు వస్తుండటంతో.. అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదని బీజేపీ నాయకులు నిరసన బాట పట్టారు. సెగ్మెంటులో అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఆయన అందుబాటులో లేకపోవటమే విమర్శలకు తావిస్తోంది.

బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా తెలంగాణ రాష్ట్ర సాధనకు యువతను ఏకం చేసిన యువ నాయకుడు. తూటాల్లాంటి మాటలు, మంచి వాగ్ధాటి గల నేతగా పేరు పొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్ నుంచి 2018లో పోటీ చేసి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలును కాదని.. సీఎం కేసీఆర్ బాల్క సుమన్‌కు చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. నల్లాల ఓదేలు వర్గీయుల నిరసనలు, ఆందోళన మధ్యనే ఆయన 2018 డిసెంబరులో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ క్రమంలోనే గత రెండున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నియోజకవర్గానికి సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందేలా నిధులు తీసుకు వస్తున్నారు. గతంలో కంటే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న బాల్క సుమన్.. నియోజకవర్గంలో కాకుండా.. హైదరాబాదులోనే ఎక్కువగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఆగస్టు నుంచి నవంబరు వరకు నాలుగు నెలల కాలంలో పట్టుమని పది సార్లు మాత్రమే తన నియోజక వర్గానికి వచ్చారటా. అసలే సెగ్మెంటుకు అంతంత మాత్రంగానే వస్తుండగా.. అందులోనూ నాయకులకే అందుబాటులో ఉంటున్నారటా. సామాన్య కార్యకర్తలు, ప్రజలకు కలిసేంత సమయం ఉండటం లేదనే చర్చ సాగుతోంది.

ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చెక్కుల పంపిణీ, ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నారటా. కార్యక్రమాల షెడ్యూల్ సమయసారిణి కూడా సరిగా పాటించరటా. క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటన, జనాల్లోకి పూర్తిగా వెళ్లటం లేదటా. ఫిబ్రవరి 26న పార్టీ సభ్యత్వ నమోదు ముగింపునకురాగా.. మార్చిలో అసలే రాలేదు. గత 40రోజులుగా సెగ్మెంటు వైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దవూర మండల ఇంచార్జిగా ఉన్నారు. మరో 10రోజుల వరకు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు.

గతంలో పని చేసిన ఎమ్మెల్యేలు, నాయకుల కంటే అభివృద్ధి పరంగా కొంత మెరుగ్గానే ఉంది. ఆయన వచ్చినప్పుడే హడావుడి చేసే బడా, చోటా నాయకులు.. తర్వాత క్యాంపు ఆఫీసు వైపు రావటం లేదటా. దీంతో పనుల పరిశీలన లేకపోవడంతో వేగవంతం కావటం లేదు. జలాల్ పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ చౌరస్తా సెంట్రల్ లైటింగ్, నాలుగు వరుసల రోడ్డు పనులు ప్రారంభమైనప్పటికీ.. కాంట్రాక్టరుకు బిల్లు రావడం లేదని పనులు ఆపేశారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. 30 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోగా.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనుల పరిస్థితి అలాగే ఉంది.

యువనేత కేటీఆర్ కోటరీలో కీలక నేతకాగా.. ఎక్కువ సమయం పార్టీ బాధ్యతలతో హైదరాబాదులో ఉంటున్నారని తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి క్రమంగా దూరం అవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఆయనపై పోటీ చేసి ఓడిన బోరకుంట వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. దీంతో సుమన్‌కు పెద్దగా పోటీ లేకపోయినా.. పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా మరో ఇద్దరు కీలక నేతలున్నారు. సుమన్ మీద ఉన్న ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed