బ‌ల్దియా బడ్జెట్‌ రూ. 6,973 కోట్లు

by Shyam |
బ‌ల్దియా బడ్జెట్‌ రూ. 6,973 కోట్లు
X

జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.6,973కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో కొత్తగా రోడ్ల అభివృద్ది, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ. 1,593.64 కోట్లు కేటాయించారు. కాగా,భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలపై విధిస్తున్న జ‌రిమానాల‌పై వ్యక్తిగత అభిప్రాయాలు లెక్కెలోకి తీసుకుని అధ్యయనం చేసేలా ఓ కమిటీని నియ‌మించేందుకు కౌన్సిల్లో తీర్మానించారు. న‌గ‌రంలో నేటికి చేప‌ట్టిన డ‌బుల్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖ‌ర్చు చేయగా, మరో రూ.90కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది. చివరిదశలో ఉన్న 65వేల ఇళ్లు ఆగ‌ష్టు నాటికి పూర్తిచేసి ల‌బ్దిదారుల‌కు అంద‌జేయ‌నున్నట్టు మేయ‌ర్ తెలిపారు. నేటివరకు 5,700 మంది డబుల్ ల‌బ్దిదారులను గుర్తించి వివ‌రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్టు చెప్పారు. స్థానిక సంస్థలకు రాష్ట్ర ఫైనాన్స్ క‌మిష‌న్‌ సూచన మేరకు బల్దియా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంద‌న్నారు. అలాగే న‌గ‌ర శివార్లో వాటర్ సీవరేజ్, స్ట్రామ్ వాట‌ర్ డ్రెయిన్ల స‌మ‌స్యను అధిగమించేందుకు హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ కు పనులు అప్పగించినట్టు సమాచారం.పార్కుల అభివృద్ధికి రూ.50 నుంచి 60 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో 500 చొప్పున న‌గ‌రంలో ఆధునిక డిజైన్లతో 3వేల ప‌బ్లిక్ టాయిలెట్లు నిర్మాణం చేపడుతామన్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2020లో భాగంగా బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్టు వివ‌రించారు.

2020-21 వార్షిక బ‌డ్జెట్‌ను రెండు విభాగాలుగా తీర్చిదిద్దినట్టు మేయర్ వెల్లడించారు. మొత్తం బ‌డ్జెట్ రూ. 6973 కోట్ల 64లక్షలు కాగా జీహెచ్ఎంసీకి రూ. 5380 కోట్లు, మౌలిక వ‌స‌తుల అభివృద్దికి హైద‌రాబాద్ రోడ్ అన్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్, హౌసింగ్ కార్పొరేష‌న్‌కు ఇచ్చే నిధులు రూ. 1593 కోట్ల 64 ల‌క్షలను కూడా బ‌డ్జెట్‌లో చేర్చిన‌ట్టు తెలిపారు. వీటిని కూడా బల్దియా కిందే ఖ‌ర్చుచేస్తామన్నారు. బల్దియాలో రెవెన్యూ ఆదాయం రూ. 3667 కోట్లు కాగా రూ. 603 కోట్ల మూల‌ధ‌నం క్యాపిట‌ల్ రిసీట్స్ గా, మిగిలిన నిధుల‌ను బాండ్లు, బ్యాంకు రుణాల రూపంలో సేక‌రిస్తామన్నారు. రెవెన్యూ ఆదాయంలో అధిక శాతం రూ. 1,803 కోట్లు ఆస్తిప‌న్ను రూపంలో వస్తోంది. రెవెన్యూ వ్యయం రూ. 2750 కోట్లు కాగా, పెట్టుబ‌డి వ్యయం రూ. 2630 కోట్లుగా తేలింది. ఎస్‌.ఆర్‌.డి.పి కింద రూ. 3500 కోట్ల ప‌నుల్లో బాండ్లు రూ. 1000 కోట్లు, బ్యాంకు రుణం రూ. 2500 కోట్ల నిధులు సేక‌రించాల‌ని గ‌తంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర‌కు 2017-18లో మొద‌టి విడుత‌గా బాండ్ల ద్వారా రూ. 200 కోట్లు, 2018-19లో రెండో విడ‌త‌గా రూ. 195 కోట్లు, 2019-20లో మూడో విడ‌త‌గా రూ. 100 కోట్లు మొత్తం రూ.495 కోట్లు సేకరించారు. ఎస్‌.బి.ఐ క్యాబ్స్ ద్వారా తీసుకునే రూ. 2,500 కోట్లతో ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నులు వేగంగా పూర్తవుతాయి. అలాగే రూ.1393 కోట్ల 64ల‌క్షల నిధుల‌ను డ‌బుల్ ఇళ్ల నిర్మాణానికి ఖ‌ర్చు చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రాంట్ల ద్వారా బల్దియా పొందుతుంది. నిధుల కేటాయింపుల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1,639.80 కోట్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవ‌ర్లు, స‌బ్‌వేల‌కు రూ. 94.45 కోట్లు, మురుగు,మంచినీటి స‌ర‌ఫ‌రా, స్ట్రామ్ వాట‌ర్ డ్రైనేజికి రూ.326 కోట్లు, వీధిదీపాల ఏర్పాటుకు రూ. 22 కోట్లు కేటాయించారు.గతేడాది లాగా ఎస్సీ వ‌ర్గాల‌ ప్రాంతాలాభివృద్దికి రూ.48కోట్లు, ఎస్టీ ప్రాంతాలాభివృద్దికి రూ.19 కోట్లు ఖ‌ర్చు చేయనున్నారు. స‌మావేశానికి పార్లమెంటు, ఎమ్మెల్యే, ఎమ్మల్సీలతో పాటు కార్పొరేట‌ర్లు క‌లిపి మొత్తం (132) మంది హాజ‌రైనారు.

Advertisement

Next Story

Most Viewed