జిగేల్ మన్న బాలాపూర్ గణేశ్.. మంత్రి సబితా ప్రత్యేక పూజలు

by Shyam |   ( Updated:2021-09-10 11:26:09.0  )
జిగేల్ మన్న బాలాపూర్ గణేశ్.. మంత్రి సబితా ప్రత్యేక పూజలు
X

దిశ, జల్‌పల్లి : వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 41వ గణేష్ నవరాత్రి వేడుకలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సన్నాయి మేళాలు… వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ తొలిరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అసోసియేషన్ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం మొదటి పూజలు నిర్వహించారు. ఎంతో విశిష్టత కలిగిన 21 కిలోల బాలాపూర్ గణేష్ లడ్డుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 15 ఫీట్ల వినాయక ప్రతిమ చేతిలో పెట్టారు.

పూజలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

బాలాపూర్ గణేష్ మండపానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మేయర్‌లు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం లడ్డును ప్రసాదంగా బహుకరించారు.

ఆకట్టుకుంటున్న భారీ TTD ఆకృతి మండపం..

ఈయేడు తిరుమల తిరుపతి దేవస్థానం అకృతిలో ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. కరోనా కారణంగా వినాయక మండపానికి లోపలికి వెళ్ళడానికి.. బయటికి వచ్చే రెండు దారులను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా మండపంలో 15 ఫీట్ల ఎత్తులో సహజసిద్ధంగా కూర్చుని ఉన్న స్థితిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ వినాయకుని కళ్ళు , చెవులు కదిలే విధంగా తీర్చి దిద్దారు. ఒక చేతిలో అభయ హస్తం, మరో చేతిలో పాషం ధరించి ఉన్నట్టుగా ప్రత్యేకంగా బాలాపూర్ వినాయకుని తయారు చేయించారు.

కరోనా కారణంగా ఉత్సవ సమితి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. మండపం ఆవరణలో అక్కడక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. తొలిరోజే వేలాది మంది భక్తులు బాలాపూర్ గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. బంగారు వర్ణంలో ఏర్పాటు చేసిన స్తంభాల ముందు, బాలాపూర్ వినాయకుని ప్రతిమ ముందు భక్తులు ఎంతో ఆసక్తిగా సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ ఆధ్వరంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed