బహుజన జాతి మేలుకొలుపు మాన్యశ్రీ కాన్షిరాం

by Ravi |   ( Updated:2020-10-08 12:17:40.0  )
బహుజన జాతి మేలుకొలుపు మాన్యశ్రీ కాన్షిరాం
X

ఇండియాలో అనాదిగా చోటుచేసుకున్న సాంఘిక అసమానతలు, అంటరానితనం, కుల పీడన, మత ఘర్షణలు శూద్ర, అతిశూద్రుల పేరున అణచివేత, పేదరికంతో ప్రజలు హింసించబడుతున్న వేళా! అనేక వివకక్షలకు దారి తీసిన నేపథ్యంలో బానిస విమిక్తి నుంచి, అక్షరాస్యత వైపు నడిపిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహుమహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, నారాయణగురు, పెరియర్, భాగ్యరెడ్డి వర్మ లాంటి ఉద్యమకారులెందరో చేసిన ఉద్యమాల వల్ల దేశంలో ఎన్నో చారిత్రాత్మక మార్పులకు దారితీసింది.

బహుజన మాహాత్ముల బాటలో నడిచిన మరో మహానుభావుడు, భారతదేశ చరిత్రలో మరో చారిత్రక మలుపు తిప్పిన మరో గొప్ప నాయకులు మాన్యశ్రీ కాన్షిరాం. బహుజన లోకం ఒక్కటైతే రాజ్యాధికారం అనివార్యం అని బహుజన సమాజ్ పార్టీ స్థాపన ద్వారా నిరూపంచిన ఏకైక వ్యక్తి కాన్షిరాం. 1934 మార్చి 15 న పంజాబ్ రాష్ట్రం రోపడ్ జిల్లా కావాస్పూర్ గ్రామం బిషన్ సింగ్ కౌర్, హరిసింగ్ తేజ్ సింగ్ దంపతులకు జన్మించారు కాన్షిరాం. బి.ఎస్సి వరకు చదివిన ఆయన.. వృత్తి రీత్యా పూనా రక్షణ శాఖలో శాస్త్రవేత్త గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అంబేడ్కర్ జయంతి సెలవు ప్రకటన కోసం 1965 లో ఆందోళనతో, మొదటి సారి ఉద్యమ జీవితం ప్రారంభించారు. వారి స్నేహితుడి ద్వారా అంబేడ్కర్ రాసిన “కుల నిర్మూలన” పోరాట పుస్తకం చదవడం.. ఆ తరువాత వెనక్కితిరిగి చూసుకోకుండా పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. కాన్షిరాం ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో “కుల నిర్మూలన” పుస్తకం ప్రథమమమైనది. 1971 లో ఎస్సీ, ఎస్టీ, ఓ బి సి, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978 లో బాక్ వార్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (బామ్ సెఫ్)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగిన వారిని ఆ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేసారు. అసమానతలు నిర్ములించే దిశగా బహుజన జాతి ఉన్నత ప్రభుత్వ అధికారులను ఒక సిద్దాంతంపైకి తెచ్చి, విద్యకు, ఉద్యోగాలకు దూరమైన ప్రజల్ని చైతన్యం పరిచే దిశగా ఈ ఉద్యమం చేపట్టాడు.

1981లో (డీఎస్4) దళిత్ శోషత్ సమాజ్ సంఘర్శ్ సమితి స్థాపించి అస్పృష్యుల జీవితాల్లో వెలుగుకు కారణమయ్యారు. అంబేడ్కర్ బోధించిన రాజ్యాధికారమే మాస్టర్ కీ ని ఆదర్శంగా తీసుకొని 1984 లో బహుజన సమాజ పార్టీ స్థాపించారు. ఉత్తరప్రదేశ్ లో 1993 లో బహుజన నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాన్షిరాం నిరంతర పోరాటం వల్ల 1995లో వారి ఉద్యమ శిష్యురాలు మాయావతి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టారు. 1991 లో ఉత్తరప్రదేశ్ లోని ఎత్త్వాహ్ లోకసభకు ఎన్నికైనా కాన్షిరాం 1996లో, పంజాబ్ హోశియార్ పూర్ నుండి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. 2001లో బెహేన్ జీ మాయవతిని తన రాజకీయ వారసురాలిగా, నాయకురాలిగా ప్రకటించారు. భారతదేశంలో బహుజన్ పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాలు అటు పార్లిమెంట్ మరియు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే కాన్షిరాం కృషియే కారణం. నేడు బిఎస్పీ, జాతీయ పార్టీగా గుర్తింపు పొందిందంటే వారు చేసిన ఉద్యమ ప్రతిఫలానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. బహుజన సమాజాన్ని రాజ్యాధికార మేల్కొలుపునకై, అధిక సంఖ్యలో జనాల్ని చైతన్యపరుచుట కొరకు అంబేడ్కర్ చెప్పిన విధంగా ” “బోధించు, సమీకరించు, పోరాడు” సిద్ధాంతానికి నిదర్శనంగా 1983 మార్చి 15 న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల గుండా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4200 కి. మి. ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షిరాం.

పూణే ఒడంబడిక 50 సంవత్సరాలు నిండిన సందర్బంగా రాజకీయ విమర్శనాత్మకంగా రచించిన ఇంగ్లీష్ పుస్తకమే “The Chamcha Age” ను తెలుగు అనువాదం – చెంచాయుగం, బహుజన ప్రజలను రాజకీయ చైతన్యం వైపు నడిపించడంలో ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఒక్కరు చెంచాయుగంను ఎదురించాలంటే చదువే ఏకైక ఆయుధమని బోధించిన మహనీయుడు. వారి ఉద్యమం ఎప్పుడు కూడా శాంతియుతంగాను, ప్రజాస్వామ్యంగాను నిరంతరాయం గాను జరగాలి తప్పా! హింసాత్మకం కాకూడదని కార్యరూపం దాల్చిన మరో శాంతి స్వరూపుడు. బహుజన లోకం రాజ్యాధికారం, బానిస విముక్తి, వెట్టిచాకిరి లాంటి సాంఘీక రుగ్మతులు నిర్మూలింపబడాలంటే మూడు త్రికరణ – ఆచరణ ప్రమాణాలు వివరించారు.

1. చెంచాయుగం సవాలును ఎదుర్కొవటం
2.చెంచాయుగనికి ముగింపు పలకడం.
3.నూతన వికాసయుగంలోనికి ప్రవేశించడం
చెంచా అంటే, చెంచా లాగా ఇతరుల చేతిలో ఆడింపబడతారు. దళిత బహుజన ప్రజలు బానిసత్వం నుండి ఎదిగిన నాయకులు చెంచాగిరి నుండి బయటపడిన నాడే దేశంలో బహుజనులకు విముక్తి జరుగుతుందని ఆచరణాత్మక రాజకీయాలు చేసిన కాన్షిరాం నేటి బహుజన తరానికి ఆదర్శం కావాలి.

( అక్టోబర్ 9 కాన్షిరాం 14 వ వర్థంతి సందర్భంగా)

– రాచకొండ ప్రవీణ్ కుమార్
సెల్ : 94913 69109

Advertisement

Next Story

Most Viewed