- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటిరెడ్డికి మరో‘సారీ’.. గుత్తాకు ఎమ్మెల్సీగా రెన్యూవల్!
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాజకీయమంతా ఒక ఎత్తయితే.. ఉమ్మడి నల్లగొండ రాజకీయాలు మరో ఎత్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనా కాలం నుంచి నేటి ప్రత్యేక రాష్ట్రం వరకు జిల్లా రాజకీయాలకు ఎవ్వరికీ అంతుచిక్కదు. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకున్న కమ్యూనిస్టుల దగ్గర్నుంచీ మొన్నటి వరకు జిల్లాను శాసించిన కాంగ్రెస్ నేతల వరకు అంత ప్రత్యేకమే. ఎలక్షన్ ఏదైనా కొంత వైవిధ్యం కన్పించడం ఇక్కడ సాధారణం. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా రాజకీయాల్లో వైవిధ్యతను చాటుకుంటోందనే చెప్పాలి. గవర్నర్ కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాను పక్కన పెడితే.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాపైనే అందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ రేసులో చాలామంది ఆశావాహులు ఉన్నా.. గుత్తాకే మరోసారి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఇద్దరిలో ఒక్కరికే..
నల్లగొండ జిల్లా నుంచి శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డి ప్రధానంగా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వాస్తవానికి జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. నేతి విద్యాసాగర్‌కు ఇప్పటికే ఎమ్మెల్సీగా రెన్యువల్ అవకాశం దక్కింది. దీంతో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే మిగిలింది గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈయనకు ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాల పదవీకాలం పూర్తికాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తనకు అవకాశం కల్పిస్తారని గుత్తా వర్గీయులు చెబుతున్నారు. అయితే నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఆ పార్టీ సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈసారి తనకు అవకాశం ఇస్తారని కోటిరెడ్డి వర్గీయులు వాదిస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే.. గుత్తా, కోటిరెడ్డిలు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఇతర జిల్లాల నుంచి ఎమ్మెల్సీ పదవికి తీవ్ర పోటీ ఉండడంతో ఇద్దరికీ అవకాశం దక్కడం కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ దాదాపు ఖరారయ్యిందనే చెప్పాలి.
వర్గపోరు కలిసొచ్చిందా..?
ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌లో తీవ్ర వర్గపోరు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సాగర్ ఉపఎన్నిక సమయం నుంచి ఈ వర్గపోరు మరింత తీవ్రతరమయ్యింది. ఉమ్మడి జిల్లాలోని ఓ ఇద్దరు కీలక నేతల మధ్య వర్గపోరు ఇటీవల నార్మాక్స్ చైర్మన్ ఎన్నిక సమయంలో తారాస్థాయికి చేరుకుందని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అయితే అందులోని ఓ నేతకు పార్టీ అధిష్టానం నుంచి సరైన గుర్తింపు దక్కట్లేదనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది. ఈ సంకేతాలు టీఆర్ఎస్ పార్టీని బలహీనం చేస్తాయనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఒకనొకదశలో గుత్తా సుఖేందర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని, అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనే ప్రచారం లేకపోలేదు. కానీ ఈ ప్రచారం ఓవైపు జరుగుతున్నప్పటికీ గుత్తా మాత్రం సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఇటీవల తరచూ ప్రెస్‌మీట్లు పెట్టడం గమనార్హం. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ గుత్తాకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం కల్పించడం దాదాపుగా ఫైనల్ అయ్యింది.
రేపు నామినేషన్ వేసే అవకాశం..
ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. కార్తీక సోమవారం నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గుత్తాకు రెండు రోజుల క్రితమే ఎమ్మెల్సీ కన్‌ఫర్మ్ అయ్యిందని ఆ వర్గమంతా జోష్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా జిల్లా నుంచి ఇప్పటికే తేరా చిన్నపరెడ్డి ఉండగా, మరోసారి ఆయనకే అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్సీలు ఇవ్వడం అసాధ్యమే. దీంతో ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా మరోసారి నిరాశే మిగలనుంది.