Back words : మాట, పాట అంతా రివర్స్‌లోనే!

by Sujitha Rachapalli |   ( Updated:2021-05-16 07:07:02.0  )
Back words :  మాట, పాట అంతా రివర్స్‌లోనే!
X

దిశ, ఫీచర్స్ : ఉర్ధూ భాషను రైట్ టు లెఫ్ట్ రాసినట్లే.. సాధారణంగా మనం రోజు మాట్లాడే పదాలను రివర్స్‌గా ట్రై చేస్తే ఎలా ఉంటుంది. అది చాలా కష్టసాధ్యమైన పని. కానీ నార్త్ కరోలినాకు చెందిన వీడియో ఎడిటర్ జాన్ సెవియర్ ఆస్టిన్ మాత్రం ఎంతో తేలికగా, సులభంగా వెనుకకు మాట్లాడటమే కాదు.. పాడతాడు కూడా. అదెలా సాధ్యమంటారా?

సెవియర్ ఆస్టిన్ చిన్నప్పుడు చాలా మంది పిల్లల కంటే కొంచెం భిన్నంగా ఉండేవాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అతనికి ‘ఆస్పర్జర్ సిండ్రోమ్’(ఆటిజం స్పెక్ట్రంపై న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్) ఉన్నట్లు వైద్యుల ద్వారా తెలిసింది. ఈ డిజార్డర్ అతడికేం కీడు చేయలేదు. తనను నలుగురిలో భిన్నంగా ఉండేలా చేసింది. ఈ సిండ్రోమ్ వల్లే వెనుకకు మాట్లాడే, పాడే సామర్థ్యం ఆస్టిన్‌కు రావడం విశేషం. ఆస్పర్జర్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన స్పెక్ట్రం డిజార్డర్. ఇదో మానసిక రుగ్మత కాగా ఇది అనేక రకాల లింక్డ్ కండిషన్స్ కలిగి ఉంటుంది.

తన తోటి పిల్లలు ఆస్టిన్‌ను హేళన చేసేవారు. ఆ బాధను తట్టుకోవడానికి సంగీతాన్ని వినేవాడు. అయితే ఓ రోజు అనుకోకుండా తన రికార్డ్ ప్లేయర్ విరిగిపోయింది. దాన్ని ఆన్ చేస్తే రివర్స్‌లో రికార్డులు వినిపించేవి. అయితే దాన్ని బాగు చేయడానికి బదులు ఆస్టిన్ ఆ ప్లేయర్‌లో వినిపించిన మాదిరిగానే రివర్స్‌లో పాడటం ప్రారంభించాడు. ఒక పాట తరువాత మరొకటి అలా వింటూ వింటూ.. అతను అన్ని పాటలను వెనుకకు పాడేయడం నేర్చుకున్నాడు. అంతేకాదు ఈ క్రమంలోనే ఆంగ్ల భాషలోని దాదాపు ప్రతి పదాన్ని రివర్స్‌లో మాట్లాడే సామర్థ్యాన్ని సంపాదించాడు.

‘నా మెదడు ఈ పనులన్నింటినీ ఒకేసారి చేయగలదు. దీన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే నా మెదడు కేవలం వెనుకకు మాట్లాడటమే కాదు. వెనుకకు కూడా ఆలోచించగలదు. నా మెదడు సామర్థ్యం ఎంత ప్రత్యేకమైందో గ్రహించిన తర్వాత నా ప్రత్యేకతను గుర్తించి నన్ను నేను అంగీకరించాను. స్పెక్ట్రం డిజార్డర్‌లో ఉన్నవారిని తెలివి తక్కువవారు లేదా ఏమీ చేయలేరని అనడం సరికాదు. మేము అద్భుతమైన వ్యక్తులం. స్పెక్ట్రం డిజార్డర్ వల్ల మేము అసాధారణమైన పనులు చేయగలం. కాబట్టి ప్రజలు మమ్మల్ని తక్కువ అంచనా వేసి చూడొద్దు’ అని ఆస్టిన్ తెలిపాడు.

ఆస్టిన్ ఇప్పటికే అనేక టెలివిజన్ కార్యక్రమాలు, టాలెంట్ షోలలో తన ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ చానెల్‌ను హోస్ట్ చేస్తున్నాడు. అందులో అతడు రివర్స్‌లో మాట్లాడుతూ, పాటలు పాడుతూ ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

Advertisement

Next Story