పోలీసుల అత్యుత్సాహాంతోనే విద్యార్థినీ ఆత్మహత్య!

by Sumithra |
HRC
X

దిశ, క్రైమ్ బ్యూరో: పోలీసుల కారణంగానే బీ ఫార్మసీ విద్యార్థినీ ఆత్మహత్య చేసుకున్నట్టు న్యాయవాది అరుణ్ మానవ హక్కుల కమిషన్‌లో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. ఘట్‌కేసర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థినీ ఈ నెల 10వ తేదీన తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారంటూ తల్లికి సమాచారం ఇవ్వడంతో, ఆమె తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రాచకొండ పోలీసులు పలు ప్రత్యేక బృందాలతో గాలించి, విద్యార్థినీని క్షేమంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విచారణలో కిడ్నాప్, అత్యాచారం అంతా ఉత్తిదే అని తేలడంతో.. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేరెడ్మెట్‌లోని తన కార్యాలయంలో ఈ నెల 13న ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఈ నెల 24వ తేదీ బుధవారం ఆ విద్యార్థినీ ఆత్మహత్య చేసుకుంది.

ఈ నేపథ్యంలో కిడ్నాప్ అంతా డ్రామా అని ప్రెస్‌మీట్‌లో సీపీ చెప్పడంతో విద్యార్థినీ అవమానకరంగా భావించి, మానసికంగా క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా న్యాయవాది అరుణ్ మానవ హక్కుల కమిషన్ ముందు గురువారం వాదించారు. అలాంటి వాళ్ళను క్షమించేది లేదని ఈ సందర్భంగా కమిషన్ వ్యాఖ్యలు చేయగా.. తాను ఏ అమ్మాయిలు లేదా ఏ అబ్బాయి తరపున వాదించడం లేదని న్యాయవాది స్పష్టం చేశారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి దర్యాప్తు విషయాలను మీడియాకు లీక్ చేయకుండా ఉన్నట్లయితే ఆ విద్యార్థినీ ఆత్మహత్య చేసుకోకుండా ఉండేదని అన్నారు. పోలీసులకు ప్రెస్‌మీట్ పెట్టి కేసుకు సంబంధించిన అంశాలను వెల్లడించేందుకు చట్టంలోని ఏ సెక్షన్ అనుమతిస్తోందనే ప్రశ్నను కమిషన్ ముందు ఉంచారు. దీనికి స్పందించిన కమిషన్ ఈ తరహా కేసులకు సంబంధించి ఏమైనా సుప్రీంకోర్టు తీర్పులు ఉంటే ఫైల్ చేయాలని న్యాయవాది అరుణ్‌ను ఆదేశించి, తదుపరి విచారణను మార్చి 15 నాటికి కమిషన్ వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed