నెల్లూరు పెద్దారెడ్డి డైలాగ్ గుర్తొస్తుంది -అయ్యన్న

by srinivas |
నెల్లూరు పెద్దారెడ్డి డైలాగ్ గుర్తొస్తుంది -అయ్యన్న
X

దిశ, విశాఖపట్నం: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖను అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో మీడియాకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు విజయసాయిరెడ్డిని, విశాఖలో నిర్వహించిన వాకథాన్ లో ఆయన మాట్లాడిన మాటలను వింటుంటే… కమెడియన్ బ్రహ్మనందం చెప్పిన “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?” డైలాగ్ గుర్తొస్తుందన్నారు. విశాఖలో విజయసాయి విధ్వంసాలు తప్ప, అభివృద్ధి ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు.

విశాఖలోని వాల్తేర్ క్లబ్, గ్రామసమాజం, బేపార్క్, రామానాయుడు స్టూడియో, గీతం కాలేజీ, మాన్సాస్ ట్రస్ట్ భూములు, సింహాద్రి అప్పన్న స్వామి భూములు సహా కనిపించిన ప్రతి స్థలాన్ని విజయసాయి కబ్జా చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. అటువంటి వ్యక్తి విశాఖను అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం… కన్నతల్లికి కూడుపెట్టనివాడు, పినతల్లికి బంగారుగాజులు చేయిస్తానన్నట్లుగా ఉందన్నారు.

ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ లో, ఈ 18నెలల్లో తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవన్నారు. పనులు చేయకపోగా ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిచడానికి ఈప్రభుత్వం సిద్ధమైందన్నారు. విశాఖకు రైల్వేజోన్ తెస్తామని చెప్పినవారు, ప్రధాని మెడలు వంచుతామని బీరాలు పలికిన వారు, ఇప్పుడు ఢిల్లీలో ఏం గడ్డి పీకుతున్నారో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. విజయసాయిరెడ్డి ఇకనుంచైనా వళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిదని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.

Advertisement

Next Story