రాంలాల్లాకు అలంకరించిన ఆభరణాలు, పట్టు పీతాంబరాలకు గల ప్రత్యేకత ఏంటో తెలుసా

by Sumithra |   ( Updated:2024-01-23 11:53:24.0  )
రాంలాల్లాకు అలంకరించిన ఆభరణాలు, పట్టు పీతాంబరాలకు గల ప్రత్యేకత ఏంటో తెలుసా
X

దిశ, ఫీచర్స్ : ఎన్నో ఏళ్ల తర్వాత కోట్లాది మంది రామభక్తుల కల సాకారమైంది. రామజన్మభూమిలో బాలరాముడు కొలువుదీరాడు. అయోధ్యలో కొలువుదీరిన రాంలల్లాను ప్రత్యేక ఆభరణాలు, పట్టుపీతాంబరాలతో అలంకరించారు. ఈ అలంకరణలో శ్రీరామచంద్రుడు సర్వాంగ సుందరంగా, శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అయితే రాంలల్లాకు అలంకరించిన ఆభరణాలు, పట్టుపీతాంబరాలకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. మరి ఆ ప్రత్యేకతలు ఏమిటి, ఏయే ఆభరణాలను బాలరామునికి అలంకరించారో ఇప్పుడు తెలుసుకుందాం.

దివ్య ఆభరణాలు, వస్త్రాలను అలంకరించిన రాంలల్లాను గర్భగుడిలో ప్రతిష్టించారని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. రాంలల్లాకు అలంకరించిన ఆభరణాలను యతీంద్ర మిశ్రా కాన్సెప్ట్, డైరెక్షన్‌లో అంకుర్ ఆనంద్ సంస్థ హర్షహైమల్ శ్యామ్‌లాల్ జువెలర్స్ వారు తయారు చేశారని తెలిపారు.

రాంలల్లాకు అలంకరించిన ప్రత్యేక ఆభరణాల వివరాలు

కిరీటం

ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం రాంలల్లా కిరీటం బంగారంతో తయారు చేశారు. ఇందులో రూబీ, పచ్చ, వజ్రాలు ఉపయోగించారు. కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిత్రాన్ని చిత్రీకరించారు. కిరీటం కుడి వైపున ముత్యాల తీగలను పెట్టారు. జాతీయ పక్షి నెమలిని చిత్రాన్ని కూడా కిరీటంలో చూపించారు.

కంకణం

రాంలల్లా కంకణంలో నెమలి ఆకారాలు ఉన్నాయి. కంకణాన్ని బంగారంతో తయారు చేసి వజ్రాలు, కెంపులు, పచ్చలను పొదిగారు.

చంద్రవంక హారం..

రాంలల్లా మెడను చంద్రవంక ఆకారపు రత్నాలు పొదిగిన హారంతో అలంకరించారు. ఈ హారంలో సూర్య భగవానుని చిత్రం ఉంది. బంగారంతో చేసిన ఈ నెక్లెస్‌లో వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగారు.

కౌస్తుభమణి

కౌస్తుభమణిని రాంలల్లా హృదయం పై అలంకరించారు. దీన్ని ఈ మణిని పెద్ద కెంపు, వజ్రాలతో తయారు చేశారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లోనూ కౌస్తుభమణిని తమ హృదయాలలో ధరించారని పురాణాలు చెబుతున్నాయి.

పీఠము

ఇది మెడ క్రింద, నాభి పైన ధరించే హారం. ఈ హారాన్ని ఐదు వరుసలలో చేశారు. బంగారంతో చేసిన ఈ హారంలో వజ్రాలు, పచ్చలు అమర్చారు.

వైజయంతి లేదా విజయమాల..

ఇది భగవంతుడు ధరించే మూడవ, పొడవైన హారం. దీన్ని బంగారంతో చేసి అందులో కెంపులను పొదిగారు. ఈ హారం విజయానికి చిహ్నంగా ధరిస్తారు. సుదర్శన చక్రం, పద్మం, పుష్పం, శంఖం చిత్రాలను ఈ హారంలో డిజైన్ చేశారు.

వడ్డానం

రామునికి తొడిగిన వడ్డానంలో రత్నాలను పొదిగారు. బంగారంతో చేసిన నడికట్టు సహజ సుష్మా గుర్తులను కలిగి ఉంటుంది. స్వచ్ఛతను తెలియజేసేందుకు అందులో ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు.

భుజ్‌బంధ్ లేదా అంగద్

రాంలల్లా రెండు చేతులకు బంగారం, రత్నాలు పొదిగిన భుజబంధాలు ధరించారు. చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ఉన్నాయి.

ఉంగరాలు..

రాంలల్లా ఎడమ, కుడి రెండు చేతుల వేళ్లను రత్నపు ఉంగరాలతో అలంకరించారు. శ్రీరాముని పాదాలకు ఉన్నచెప్పులు కూడా బంగారంతో తయారు చేసినవే.

భగవంతుని ఎడమ చేతిలో, ముత్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు ధనుస్సును అలంకరించారు. అదే విధంగా కుడి చేతిలో బంగారు బాణం ఉంటుంది.

హస్తకళలకు అంకితమైన శిల్ప మంజరి అనే సంస్థ తయారు చేసిన రంగురంగుల పూల బొమ్మల దండను భగవంతుని మెడలో ధరించారు.

స్వామివారి నుదుటి వజ్రాలు, కెంపులతో తయారు చేసిన మంగళ తిలకం పెట్టారు. ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు.

బాల రాముని ముందు వెండితో చేసిన గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మల బండి వంటి బొమ్మలను ఆయన ముందుంచారు.

Advertisement

Next Story

Most Viewed