గ్రామాల్లో కొవిడ్ పై అవగాహన కల్పించాలి

by Shyam |
గ్రామాల్లో కొవిడ్ పై అవగాహన కల్పించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని కొవిడ్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే సమస్యను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే జరుగుతుందని, ఈ నేపథ్యంలో జ్వరం ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ… నివేదిక అందించాలన్నారు. కరోనా తీవ్రంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా అప్రమత్తం చేయాలని, చైతన్యం కల్పించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కరోనా బారిన పడి ఇంట్లో ఎవరూ లేని ఆ తల్లిదండ్రుల పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా తల్లిదండ్రులకు కరోనా వచ్చి పిల్లలు ఒంటరిగా ఉంటే వారిని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోమ్స్ లలో ఉంచి అవసరమైన వసతులను కల్పించి సంరక్షించాలన్నారు.

Advertisement

Next Story