దేశీయంగా తగ్గిన మారుతీ సుజుకీ అమ్మకాలు

by Harish |
maruthi
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగష్టు నెలలో వాహనాల అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. అంతర్జాతీయంగా చిప్‌ల కొరత కొనసాగుతుండటంతో ఇది ఉత్పత్తిపైనే కాకుండా విక్రయాలను కొంతమేర ప్రభావం చూపింది. సమీక్షించిన నెలలో దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి మొత్తం అమ్మకాలు 5 శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, దేశీయ మార్కెట్లో మాత్రం 6 శాతం తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయంలో భారత మార్కెట్లో కంపెనీ 1,16,704 యూనిట్లను విక్రయించింది. ఇదే సమయంలో దేశీయ మరో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ భారత మార్కెట్లో తన అమ్మకాలు ఏకంగా 53 శాతం పెరిగాయని వెల్లడించింది.

హ్యూండాయ్ సంస్థ మొత్తం అమ్మకాలు 12.3 శాతం పెరిగాయని ప్రకటించింది. దేశీయంగా అమ్మకాలు 2.3 శాతం వృద్ధితో 46,866 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సైతం అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్టు తెలిపింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 27 శాతం పెరిగినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. హోండా కార్స్ ఇండియా దేశీయ అమ్మకాల్లో 49 శాతం వృద్ధితో 11,177 యూనిట్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది. కియా సైతం 55 శాతం అమ్మకాల వృద్ధితో 16,750 యూనిట్లను అమ్మినట్టు ప్రకటించింది. టయోటా దేశీయ అమ్మకాలు రెండు రెట్లు పెరిగి 12,772 యూనిట్లు అమ్ముడైనట్టు పేర్కొంది.

నిస్సాన్ ఇండియా ఏకంగా నాలుగు రెట్ల వృద్ధితో మొత్తం 3,209 వాహనాలను విక్రయించింది. స్కోడా సైతం నిస్సాన్ బాటలోనే నాలుగు రెట్లు ఎక్కువగా 3,829 యూనిట్లను అమ్మింది. ఇక, టూ-వీలర్ విభాగంలో దిగ్గజ సంస్థ టీవీఎస్ మోటార్స్ 1 శాతం వృద్ధితో 2,90,694 యూనిట్ల వాహనాల అమ్మకాలను నమోదు చేసింది.

Advertisement

Next Story