బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు.. పేరెంట్స్‌కు కౌన్సిలింగ్

by Shyam |
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు.. పేరెంట్స్‌కు కౌన్సిలింగ్
X

దిశ, పటాన్ చెరు: బాల్య వివాహం జరుగుతుందనే సమాచారం మేరకు చైల్డ్ వెల్ఫేర్ లైన్ (సఖి) బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాన్ని అడ్డుకుని బాలికను సఖి కేంద్రానికి తరలించారు. పటాన్ చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో శుక్రవారం ఉదయం బాల్య వివాహం జరుగుతుందని చైల్డ్ లైన్ 1098 కి అందిన సమాచారం మేరకు చైల్డ్ లైన్, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గ్రామానికి చేరుకొని బాల్య వివాహాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా బాలిక యొక్క ధ్రువపత్రాల ఆధారంగా బాలికను మైనర్ గా నిర్ధారించారు.

సిసిఎస్ సీఐ భూపతి, ఏఎస్ఐ ఆసిఫ్ అలీ, బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి శ్రావణ్ కుమార్ గౌడ్ లు బాల్య వివాహము జరిపిస్తే జరిగే అనర్థాలపై బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిసిఎస్ ఇన్స్ పెక్టర్ భూపతి మాట్లాడుతూ.. బాల్య వివాహము చేయడం వల్ల మాతృ మరణాలతో పాటు శిశు మరణాలు సంభవిస్తాయన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహాలు జరిపిస్తే రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. బాల్యవివాహాన్ని జరిపించినా.. ప్రోత్సహించినా నేరమని హెచ్చరించారు. బాలికను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ముజీప్, ఉప సర్పంచ్ నగేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story