కరోనా ఫీవర్.. ఫైళ్లకు క్వారంటైన్

by Shyam |
కరోనా ఫీవర్.. ఫైళ్లకు క్వారంటైన్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ఎవరికి ఎలా సోకుతోందో అంతు చిక్కడం లేదు. కొందరికి లక్షణాలు కూడా బయటకి కనిపించడం లేదు. దీంతో భయం వెంటాడుతోంది. రోజూ కలిసేవారిని కూడా నమ్మే పరిస్థితులు లేవు. కార్యాలయం వరకు ఫర్వాలేదు. బయట ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరెవరిని కలిశారో అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. అందుకే ఫైళ్లను వెంటనే చూసేందుకు ఉద్యోగులు ససేమిరా అంటున్నారు.

వైరస్ అంటుకుంటే 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. అదే తరహాలో ఫైల్‌ను ముట్టుకుని పరిశీలించడానికి అధికారులు, సిబ్బంది ఐదు రోజుల క్వారంటైన్‌ను అప్రకటితంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ఇదే పరిస్థితి ఉంది. అన్ని మంత్రిత్వశాఖలూ, కార్యదర్శుల పేషీలు ఇతర చోట్ల నుంచి వచ్చిన పైళ్లను ముట్టుకోవడం లేదు.

ఐదు రోజుల పాటు వాటిని పక్కకు పెడుతున్నారు. డిస్ ఇన్ఫెక్షన్ ప్రక్రియ అయ్యాకే వాటిని చూస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలలోనూ ఇదే విధానం కనిపిస్తోంది. మొదట జలుబు, గొంతునొప్పి, శ్వాస సంబంధ సమస్యలే కరోనా అన్నారు. ఇప్పుడేమో తుమ్మినా, దగ్గినా, ఎక్కిళ్లు వచ్చినా, ఆఖరికి జుట్టు ఊడినా కొవిడ్ అని ప్రచారం చేస్తున్నారు. స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్, జొమోటో వంటి డెలివరీ సంస్థల ద్వారానూ వ్యాధి వచ్చిందన్న వదంతులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరిని తాకాలన్నా, దేనిని ముట్టుకోవాలన్నా భయపడే రోజులొచ్చాయి.

భయమే ఇందుకు కారణం

వైద్యారోగ్యం, పోలీసు, పారిశుద్ధ్యం, మీడియా సిబ్బంది కరోనా వారియర్లుగా ముందు వరుసలో ఉన్నారు. అనేక మంది కరోనా బారిన పడ్డారు. రెవెన్యూ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీ రాజ్, నీటి పారుదల ఇలా దాదాపు అన్ని శాఖల్లోనూ వైరస్ వ్యాపించింది. కార్యాలయంలో ఎవరికైనా కరోనా సోకితే ఆ పరిసరాలన్నింటినీ కొద్ది రోజుల పాటు వదిలేస్తున్నారు. ఆ కార్యాలయాన్ని పూర్తిగా డిస్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతే సిబ్బంది హాజరవుతున్నారు.

ఇటీవల హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని ఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి దురదృష్టవశాత్తు చనిపోయాడు. జీహెచ్ఎంసీ సిబ్బంది కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. అయినా, నమ్మకం లేక సొంత ఖర్చులతో ప్రైవేటు ఎజెన్సీతో డిస్ ఇన్ఫెక్షన్ చేయించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారికి కనీసం వీల్ చైర్ ఇవ్వకుండా రెండు గంటలపాటు వేచి ఉండేలా చేశారు. వారి అల్లుడు ఓ శాఖలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్నారు.

తన పలుకుబడిని ఉపయోగించి సీనియర్ ఐఏఎస్ అధికారితో ఆ ఆసుపత్రి యాజమాన్యానికి మూడు సార్లు ఫోన్ చేయించారు. అప్పటికి గానీ వీల్ చైర్ కేటాయిం చలేదు. వారిద్దరి చికిత్సకు రూ.12 లక్షలు ఖర్చయ్యింది. ఒకరు చనిపోయారు. బ్యాలెన్స్ చెల్లించే వరకు డెడ్ బాడీని కూడా ఇవ్వలేదు. సెలవు రోజు కావడంతో ఆన్‌లైన్‌లో ట్రాన్స్ ఫర్ చేయించారు. అమౌంట్ క్రెడిట్ కాలేదంటూ నాలుగు గంటల పాటు ప్రాసెస్ చేయలేదు. ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కార్యాలయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యంగా మారిందని ఓ అధికారి ‘దిశ’కు వివరించారు.

లోనికి అనుమతి లేదు

సందర్శకులను కార్యాలయాలలోనికి అనుమతించడం లేదు. దరఖాస్తులను ఇన్ బాక్సుల్లో వేసి వెళ్లాలని సూచిస్తున్నారు. నాలుగైదు రోజుల తర్వాత శానిటైజ్ చేశాకే చూస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ లో దరఖాస్తులకు అవకాశాలు అతి తక్కువ. రెవెన్యూ, భూ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి వ్యవస్థలు లేవు. లిఖిత పూర్వకంగా చేయాల్సిందే. అనుబంధ పత్రాలను జత చేయాల్సిందే.

ఈ క్రమంలో దరఖాస్తులను కింది స్థాయి నుంచి ఉన్నత అధికారుల వరకు చేరేందుకు జాప్యం జరుగుతోంది. కరోనా వైరస్ ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు వెళ్లే క్రమాన్ని కూడా అడ్డుకుంటున్నది. కొందరు అధికారులు మాత్రం జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని అంటున్నారు. ఫైళ్లను శానిటైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చూస్తున్నామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. గౌతంకుమార్ అన్నారు. కార్యాలయాల్లో కరోనా సోకకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు.

Advertisement

Next Story