ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం: కమిన్స్

by Shyam |   ( Updated:2020-04-03 08:04:19.0  )
ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం: కమిన్స్
X

కరోనా వైరస్ కారణంగా బీసీసీఐ.. ఐపీఎల్ సీజన్ 13ను ఏప్రిల్ 15 వరకు రద్దు చేసింది. ఆ తర్వాతైనా ఈ మెగా లీగ్ జరుగుతుందనే ఎవరికీ ఆశలు లేవు. కానీ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ తప్పకుండా నిర్వహిస్తారనే ఊహల్లో తేలిపోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆసీస్ పేసర్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుడు ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మా దేశ ఆటగాళ్లు ఇంకా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని.. ఈ ఏడాది ఐపీఎల్ రద్దు కాదనే ఆశాభావంతోనే ఉన్నట్లు’ ఆయన చెప్పారు. ప్రతీ ఆటగాడు ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను అరికట్టడమే ప్రధాన లక్ష్యమని కమిన్స్‌ చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై 6 నెలల పాటు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఐపీఎల్ జరిగితే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపాడు.

అయితే, ఈ విషయంలో ‘తాను తొందరపడట్లేదని.. ఐపీఎల్‌లో ఆడాలనే తపన మాత్రం ఉందని’ తన మనసులో మాట చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఐపీఎల్ కూడా జరగాలని కమిన్స్‌ ఆకాంక్షించాడు. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో ప్యాట్ కమిన్స్‌ను కేకేఆర్ జట్టు రూ. 15.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ లీగ్ రద్దయితే కమిన్స్ ఆ మేరకు ఆదాయం కోల్పోనున్నాడు.

Tags: IPL, BCCI, Australia, T20, Pat Cummins

Advertisement

Next Story