టీ20 ఫైనల్లో ‘భారత్ x ఆస్ట్రేలియా’

by Shyam |
టీ20 ఫైనల్లో ‘భారత్ x ఆస్ట్రేలియా’
X

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఇప్పటికే ఫైనల్ చేరుకోగా..సఫారీలపై విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ జట్టు డక్‌వర్త్-లూయీస్ పద్ధతిలో సౌతాఫ్రికా జట్టుపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఆస్ట్రేలియా మహిళా జట్టు టీ20 ఫైనల్స్‌కు చేరడం ఇది ఆరోసారి.

టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు టాపార్డర్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 98 పరుగులకు కుదించారు. కాని ప్రోటీస్ జట్టు 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేయడంతో ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరింది. కాగా, ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్స్‌లో తలపడనున్నాయి.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించారు. అలీసా హేలీ (18) పరుగులు చేసి అవుటవ్వడంతో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ లానింగ్ 49(49 బాల్స్, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో చెలరేగిపోయింది. మరో ఎండ్‌లో మూనీ (17), జోనాస్సెన్ (1), గార్డ్‌నర్ (0) వెంటవెంటనే అవుటైనా..చివర్లో హేనెస్ (17), కేరీ (7) సహకారంతో లానింగ్ జట్టుకు గౌరవప్రద స్కోరును అందించింది. డికెర్క్ 3 వికెట్లు తీయగా, ఖాక, ఎన్ లాబా చెరో వికెట్ తీశారు.

ఇక 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీల బ్యాటింగ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. అరగంటకు పైగా ఆట నిలిచిపోవడంతో డీఎల్ఎస్ ప్రకారం సఫారీల లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్ణయించారు. అయితే 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి సఫారీలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ దశలో లూస్ (21)తో కలసి వోల్వర్డ్ (41)లు ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ లూస్ అవుటైన తర్వాత క్రీజులోకొచ్చిన ట్రయాన్ (1), డీ క్లెర్క్ (6) వోల్వర్డ్‌కు సరైన సహకారం అందించలేక పోయారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 92 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కచ్ 2 వికెట్లు తీయగా, జోనాస్సెన్, మోలీనెక్స్, కిమ్మిన్స్ తలా ఓ వికెట్ తీశారు.
స్కోర్ :
ఆస్ట్రేలియా మహిళలు – 134/5 (20 ఓవర్లు)
దక్షిణాఫ్రికా మహిళలు – 92/5 (13 ఓవర్లు – డీఎల్ఎస్)

Tags: Women T20, ICC, Aus vs South Africa, Semi Final, DLS

Advertisement

Next Story

Most Viewed