ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లకు గిరాకీ సానుకూలం

by Harish |
ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లకు గిరాకీ సానుకూలం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీలైన ఆడి, మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ప్యాసింజర్ వాహనాల్లో ఎలక్ట్రిక్ విభాగం మరింత వృద్ధి సాధించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాయి. ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు ఈవీ విధానాలను అమలు చేసేందుకు దేశీయంగా అనేక రాష్ట్రాలు సిద్ధమవుతుండటం సానుకూల పరిణామమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేంద్రం ఫేమ్2 పథకం ద్వారా వ్యక్తిగత ప్యాసింజర్ వాహనాలకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందిస్తూనే, ఎలక్ట్రిక్ కార్లపై 5 శాతం జీఎస్టీ లాంటి ప్రోత్సహకాలు ఈ విభాగం వృద్ధి సాధించేందుకు సహాయపడతాయని వారు భావిస్తున్నారు. గత వారం ఆడి సంస్థ ఈ-ట్రాన్ బ్రాండ్ కింద మూడు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయడం ద్వారా తన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను ప్రారంభించింది.

మెర్సిడెస్ బెంజ్ గతేడాది అక్టోబర్‌లోనే తన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐక్యూసీని విక్రయించింది. ‘ప్రస్తుతం చాలావరకు భారత్‌లోని పలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా టూ-వీలర్, త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లకు ప్రోత్సాహకాలు ఇప్పుడిప్పుడే అందించడం సంతోషకరమని’ ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ అన్నారు. ఆడి ఇండియా 2025 నాటికి తన మొత్తం అమ్మకాల్లో 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా ఉంది. ‘భారత వినియోగదారుల కోసం తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి కొత్త సాంకేతికతతో కార్లను తీసుకువస్తుందని’ మెర్సిడెస్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ చెప్పారు.

Advertisement

Next Story